కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్ | Amir plays Mind Game with team India captain Kohli | Sakshi
Sakshi News home page

కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్

Published Sat, Jun 17 2017 12:00 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్

కోహ్లీని కవ్విస్తున్న పాక్ బౌలర్

లండన్: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌ల మధ్య పోరు ఎప్పటికీ ఆసక్తికరమే. అందులోనూ ఐసీసీ ఓ మేజర్ టోర్నీలో దాయాదులు ఫైనల్లో తలపడనుండటంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ బౌలర్ మొహమ్మద్ ఆమీర్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని కవ్వించే యత్నాలు మొదలుపెట్టాడు. కెప్టెన్‌గా కోహ్లీకి ఇది మేజర్ టోర్నీ తొలి ఫైనల్ అని.. అందుకే అతడిపైనే ఒత్తిడి ఉంటుందన్నాడు. పాక్ జట్టు ఇప్పుడు అన్ని విభాగాల్లోనూ రాణిస్తుందని, అందుకే విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశాడు ఆమీర్.

'కోహ్లీ వికెట్ త్వరగా తీస్తే పాక్‌కు లాభదాయకమే. కానీ అతడు మా టార్గెట్ కానే కాదు. కేవలం అతడి వికెట్‌పై దృష్టిపెట్టడం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు పరుగుల వేట కొనసాగిస్తున్నారు. యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీతో పాటు హార్దిక్ పాండ్యాలతో భారత్ బ్యాటింగ్ లైనఫ్ దుర్భేద్యంగా ఉంది. తప్పిదాలకు తావివ్వకుండ పూర్తి స్థాయిలో రాణించి భారత్‌పై విజయాన్ని సాధిస్తామని' ఆమీర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌తో తలపడే ప్రతి ప్రత్యర్ధి కోహ్లీని టార్గెట్ చేయడం సహజమే. కానీ ఆమీర్ మాత్రం కోహ్లీ వికెట్ మాకు అవసరమే కానీ, కీలకమే కాదని.. కెప్టెన్‌గా అతడిపైనే ఒత్తిడి ఉందని మైండ్ గేమ్ ప్లే చేస్తున్నాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో వెన్నునొప్పి కారణంగా విశ్రాంతి తీసుకున్న ఆమీర్ ఫైనల్‌ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఆమీర్ రావడంతో ఇంగ్లండ్‌పై రెండు వికెట్లు తీసిన రుమాన్ రాయిస్‌ను ఫైనల్ ఆడే తుది జట్టునుంచి తప్పించారు. రేపు (ఆదివారం) జరిగే ఫైనల్లో ఇక్కడి ఓవల్ మైదానంలో భారత్-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement