సాక్షి, హైదరాబాద్: తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ఆర్చరీ ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించింది. హరియాణాలోని సోనేపట్‌లో జరుగుతోన్న ప్రపంచ కప్ సెలక్షన్ ట్రయల్స్‌లో జ్యోతి సురేఖ సత్తాచాటింది. ర్యాంకింగ్ రౌండ్‌లో 1440 పాయింట్లకు గానూ 1376 పాయింట్లు సాధించిన సురేఖ, ఒలింపిక్ రౌండ్‌లో నిర్ణీత 7 పాయింట్లకు 6 స్కోరు చేసి భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు ఎంపికైంది.
ఈ జట్టు ఆగస్టు 8 నుంచి 13 వరకు జర్మనీలోని బెర్లిన్‌లో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాకుండా ఆగస్టు 10 నుంచి 24 వరకు చైనీస్ తైపీలో జరగనున్న ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లోనూ సురేఖ భారత జట్టు తరఫున బరిలోకి దిగనుంది.