'మ్యాచ్ స్వరూపం మారింది అక్కడే'
కాన్పూర్: తొలి టెస్టు మూడో రోజు ఆటలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అవుటైన తరువాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయిందని టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. విలియమ్సన్ ను తన సహచర స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ బౌల్డ్ చేయడంతో అక్కడ్నుంచి కివీస్ పతనం ప్రారంభమైందన్నాడు. తొలి రెండు రోజులు న్యూజిలాండ్ స్పష్టమైన ఆధిక్యంలో నిలిచినా, మూడో రోజు ఆటకు వచ్చేసరికి భారత్ పైచేయి సాధించడానికి ఆ వికెట్ ను తొందరగా పెవిలియన్ కు పంపడమే ప్రధాన కారణమని జడేజా పేర్కొన్నాడు.
'కివీస్ బ్యాటింగ్ లైనప్లో విలియమ్సన్ సుదీర్ఘంగా క్రీజ్లో నిలబడే ఆటగాడు. ఆ వికెట్ ను సాధ్యమైనంత తొందరగా పెవిలియన్కు పంపాలనేది మూడో రోజు ఆటలో మా ప్రణాళిక. అది ఫలించిది. చక్కటి బంతితో విలియమ్సన్ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దాంతో కివీస్ ఇక తేరుకోలేకపోయింది. స్వల్ప విరామాల్లో న్యూజిలాండ్ ఆటగాళ్లను పెవిలియన్ పంపడంతో భారత్ కు ఆధిక్యం దక్కింది 'అని జడేజా తెలిపాడు. తొలి ఇన్నింగ్స్ లో జడేజా ఐదు, అశ్విన్ నాలుగు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే.