ఆధిక్యం పోయింది  | New Zealand Lead With 51 Runs In Test Match Against India | Sakshi
Sakshi News home page

ఆధిక్యం పోయింది 

Published Sun, Feb 23 2020 2:16 AM | Last Updated on Sun, Feb 23 2020 4:58 AM

New Zealand Lead With 51 Runs In Test Match Against India - Sakshi

ఇషాంత్‌కు సహచరుల అభినందన

రెండు రోజులుగా సరైన నిద్ర లేదు... 24 గంటల విమాన ప్రయాణం... అయినా సరే పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మ మరోసారి తన పదును చూపించాడు. అతని చలవతో తొలి టెస్టులో న్యూజిలాండ్‌ను భారత్‌ కొంత వరకు కట్టడి చేయగలిగింది. ఇప్పటికే స్వల్ప ఆధిక్యం కోల్పోయినా సరే... మ్యాచ్‌ పూర్తిగా చేజారిపోలేదంటే ఇషాంత్‌ బౌలింగే కారణం. తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే పరిమితమైన టీమిండియా రెండో రోజు ఆటలో ఐదు ప్రత్యర్థి వికెట్లు పడగొట్టగలిగింది. ఇద్దరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌లో ఉండగా, మిగిలిన ఐదు వికెట్లతో కివీస్‌ తమ ఆధిక్యం ఎంత వరకు పెంచుకోగలదో... భారత్‌ ఎలా అడ్డుకోగలదో నిర్ణయించే ఆదివారం ఆట మ్యాచ్‌ గమనాన్ని శాసించే అవకాశం ఉంది.   

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 51 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి కివీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (153 బంతుల్లో 89; 11 ఫోర్లు) శతకం కోల్పోగా... కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న రాస్‌ టేలర్‌ (71 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 93 పరుగులు జోడించారు. 41 పరుగుల వ్యవధిలో కివీస్‌ 3 వికెట్లు చేజార్చుకుంది.

ప్రస్తుతం వాట్లింగ్‌ (14 బ్యాటింగ్‌), గ్రాండ్‌హోమ్‌ (4 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్‌ శర్మకు 3 వికెట్లు దక్కాయి. వెలుతురు మందగించడంతో అంపైర్లు ఆటను ముందుగానే నిలిపివేశారు. మొత్తంగా రెండో రోజు 11 ఓవర్ల ఆట తక్కువగా సాగింది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 122/5తో ఆట కొనసాగించిన భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకు ఆలౌటైంది. శనివారం 13.1 ఓవర్లు ఆడి చివరి 5 వికెట్లు చేజార్చుకున్న జట్టు  మరో 43 పరుగులు జోడించగలిగింది. అజింక్య రహానే (138 బంతుల్లో 46; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. జేమీసన్, సౌతీ చెరో 4 వికెట్లు పడగొట్టారు.

పంత్‌ రనౌట్‌తో... 
మ్యాచ్‌ రెండో రోజు కూడా బ్యాటింగ్‌లో భారత్‌కు అంతా ప్రతికూలంగానే సాగింది. శనివారం తొలి ఓవర్లోనే భారీ సిక్స్‌తో పంత్‌ (19) జోరుగా ఆట మొదలు పెట్టినా అది ఎక్కువ సేపు సాగలేదు. రహానే చేసిన తప్పుతో దురదృష్టవశాత్తూ పంత్‌ రనౌట్‌గా వెనుదిరిగాడు. సౌతీ బౌలింగ్‌లో పాయింట్‌ దిశగా ఆడిన రహానే లేని సింగిల్స్‌ కోసం పరుగు అందుకోగా, పంత్‌ మాత్రం ఆసక్తి చూపించలేదు. అయినా సరే రహానే తగ్గకుండా ముందుకు దూసుకొచ్చాడు. దాంతో సీనియర్‌ కోసం వికెట్‌ త్యాగం చేసేందుకు జూనియర్‌ సిద్ధపడ్డాడు. ఎజాజ్‌ విసిరిన త్రో నేరుగా స్టంప్స్‌ను తాకడంతో రనౌట్‌ కాక తప్పలేదు.

64 టెస్టుల కెరీర్‌లో రహానే ఒక రనౌట్‌లో భాగం కావడం ఇదే మొదటిసారి! తర్వాతి బంతికే చక్కటి అవుట్‌ స్వింగర్‌తో అశ్విన్‌ (0)ను సౌతీ బౌల్ట్‌ చేశాడు. ఆ తర్వాత రహానే కూడా ఎక్కువ సేపు నిలవలేదు. అతను కూడా ‘భిన్నమైన’ రీతిలోనే వెనుదిరిగాడు. సౌతీ వేసిన బంతిని ఆడకుండా వదిలేసే క్రమంలో బ్యాట్‌ను పైకి ఎత్తినా... బ్యాట్‌ లోపలి భాగాన్ని తాకుతూ వెళ్లిన బంతి కీపర్‌ చేతుల్లో పడింది. షమీ (20 బంతుల్లో 21; 3 ఫోర్లు) కొద్ది సేపు కివీస్‌ బౌలర్లను చికాకుపర్చినా, జట్టు ఆలౌట్‌ అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.

ఇషాంత్‌ జోరు... 
టెస్టు సిరీస్‌ ప్రారంభానికి ముందు కూడా ఆడటం సందేహంగానే ఉన్నా...చివరకు సుదీర్ఘ ప్రయాణం తర్వాత జట్టుతో చేరిన సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ తన విలువేమిటో చూపించాడు. ఇద్దరు ఓపెనర్లు క్రీజ్‌లో నిలదొక్కుకుపోయి పరుగుల వేటకు సిద్ధమైన వేళ అతను జట్టుకు తొలి బ్రేక్‌ అందించాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో లెగ్‌సైడ్‌ వెళుతున్న బంతిని ఆడబోయి లాథమ్‌ (11) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో చక్కటి బంతితో బ్లన్‌డెల్‌ (80 బంతుల్లో 30; 4 ఫోర్లు)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఈ దశలో విలియమ్సన్, టేలర్‌ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేయడంతో రెండో సెషన్‌లో కివీస్‌ 99 పరుగులు చేసింది. 93 బంతుల్లో విలియమ్సన్‌ అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత ఈ భాగస్వామ్యం సెంచరీకి చేరువైన దశలో మళ్లీ ఇషాంత్‌ దెబ్బ వేశాడు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ టేలర్‌ను అవుట్‌ చేసి మ్యాచ్‌ దిశ మార్చాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో పాయింట్‌లో జడేజా చక్కటి క్యాచ్‌ పట్టడంతో విలియమ్సన్‌ సెంచరీ అవకాశం చేజారింది. నికోల్స్‌ (17)ను అవుట్‌ చేసి అశ్విన్‌ కూడా వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) సౌతీ 16; మయాంక్‌ (సి) జేమీసన్‌ (బి) బౌల్ట్‌ 34; పుజారా (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 11; కోహ్లి (సి) టేలర్‌ (బి) జేమీసన్‌ 2; రహానే (సి) వాట్లింగ్‌ (బి) సౌతీ 46; విహారి (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 7; పంత్‌ (రనౌట్‌) 19; అశ్విన్‌ (బి) సౌతీ 0; ఇషాంత్‌ (సి) వాట్లింగ్‌ (బి) జేమీసన్‌ 5; షమీ (సి) బ్లన్‌డెల్‌ (బి) సౌతీ 21; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (68.1 ఓవర్లలో ఆలౌట్‌) 165.  
వికెట్ల పతనం: 1–16; 2–35; 3–40; 4–88; 5–101; 6–132; 7–132; 8–143; 9–165; 10–165. 
బౌలింగ్‌: సౌతీ 20.1–5–49–4; బౌల్ట్‌ 18–2–57–1; గ్రాండ్‌హోమ్‌ 11–5–12–0; జేమీసన్‌ 16–3–39–4; ఎజాజ్‌ పటేల్‌ 3–2–7–0.

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) ఇషాంత్‌ 11; బ్లన్‌డెల్‌ (బి) ఇషాంత్‌ 30; విలియమ్సన్‌ (సి) (సబ్‌) జడేజా (బి) షమీ 89; టేలర్‌ (సి) పుజారా (బి) ఇషాంత్‌ 44; నికోల్స్‌ (సి) కోహ్లి (బి) అశ్విన్‌ 17; వాట్లింగ్‌ (బ్యాటింగ్‌) 14; గ్రాండ్‌హోమ్‌ (బ్యాటింగ్‌) 4; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (71.1 ఓవర్లలో 5 వికెట్లకు) 216. 
వికెట్ల పతనం: 1–26; 2–73; 3–166; 4–185; 5–207. 
బౌలింగ్‌: బుమ్రా 8.1–4–62–0; ఇషాంత్‌ 15–6–31–3; షమీ 17–2–61–1; అశ్విన్‌ 21–1–60–1.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement