భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన న్యూజిలాండ్
తొలి టెస్టులో టీమిండియా ఓటమి
8 వికెట్లతో న్యూజిలాండ్ విజయం
మెరిసిన యంగ్, రచిన్ రవీంద్ర
అంచనాలు తప్పలేదు... అద్భుతాలు జరగలేదు! బుమ్రా ఆరంభ మెరుపులు తప్ప మన బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటర్లను నిలువరించడంలో విఫలమయ్యారు. ఫలితంగా తొలి టెస్టులో భారత జట్టు పరాజయం పాలైంది.
తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలి... ఆ తర్వాత అసమాన పోరాటంతో పోటీలోకి వచ్చిన టీమిండియా చివరి రోజు మ్యాజిక్ కొనసాగించలేకపోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 36 ఏళ్ల తర్వాత భారత్‌లో టెస్టు విజయం నమోదు చేసుకుంది.
బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన న్యూజిలాండ్ జట్టు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలిచింది. భారత గడ్డపై న్యూజిలాండ్‌కు 36 ఏళ్ల తర్వాత ఇదే తొలి టెస్టు విజయం కావడం విశేషం. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1–0తో ముందంజ వేసింది.
107 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 0/0తో ఆదివారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 27.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసి గెలిచింది. విల్ యంగ్ (76 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రచిన్ రవీంద్ర (46 బంతుల్లో 39 నాటౌట్; 6 ఫోర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి పుణెలో రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఆడుతూ పాడుతూ!
తొలి ఇన్నింగ్స్‌లో భారత స్టార్ ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బందిపడ్డ చోట... నాలుగో ఇన్నింగ్స్‌లో చేధన అంత సులువు కాదని అంతా భావించారు. అందుకు తగ్గట్లే ఇన్నింగ్స్ ఐదో బంతికే టామ్ లాథమ్ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా భారత శిబిరంలో ఆనందం నింపాడు. అయితే ఆ సంబరాలు ఎక్కువసేపు సాగలేదు. బుమ్రా, సిరాజ్ కట్టుదిట్టమైన బంతులు సంధించినా... న్యూజిలాండ్ బ్యాటర్లు సంయమనం కోల్పోలేదు.
ఈ క్రమంలో కాన్వే (17) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే వెనుదిరగ్గా... క్రీజులోకి వచ్చిరాగానే రచిన్ రవీంద్ర ఎదురుదాడి ప్రారంభించాడు. మరో ఎండ్ నుంచి యంగ్ కూడా ధాటిగా ఆడటంతో లక్ష్యం సులువైపోయింది. మూడో స్పిన్నర్‌గా జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చుకోగా... అదనపు పేసర్ ఆకాశ్‌దీప్ లోటు స్పష్టంగా కనిపించింది.
వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కాగా... తిరిగి వర్షం వచ్చి మ్యాచ్ నిలిచిపోతే బాగుండు అని సగటు భారత క్రీడాభిమాని ఆశించినా అది సాధ్యపడలేదు. క్లిష్టమైన బంతులను కాచుకుంటూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదిన రచిన్, యంగ్ జోడీ మూడో వికెట్‌కు అజేయంగా 75 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్ 46; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 402; భారత్ రెండో ఇన్నింగ్స్ 462; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) బుమ్రా 0; కాన్వే (ఎల్బీ) బుమ్రా 17; యంగ్ (నాటౌట్) 48; రచిన్ రవీంద్ర (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (27.4 ఓవర్లలో 2 వికెట్లకు ) 110. వికెట్ల పతనం: 1–0, 2–35. బౌలింగ్: బుమ్రా 8–1–29–2; సిరాజ్ 7–3–16–0; జడేజా 7.4–1–28–0; కుల్దీప్ 3–0–26–0, అశ్విన్ 2–0–6–0.
ఈ మ్యాచ్ తొలి మూడు గంటలు తప్ప మేం మంచి ప్రదర్శనే చేశాం. అప్పుడప్పుడు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి. వాటిని దాటి ముందకు వెళ్లాలి. ఈ ఒక్క పరాజయాన్ని బట్టి ప్లేయర్ల సామర్థ్యాన్ని అంచనా వేయకూడదు. తొలి ఇన్నింగ్స్‌లో మా బ్యాటింగ్ బాగా సాగలేదు. రెండో ఇన్నింగ్స్‌లో దాన్ని సరిదిద్దుకున్నాం.
ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా చాలా పాఠాలు నేర్చుకున్నాం. శుబ్‌మన్ గిల్ స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ బాధ్యత తీసుకొని భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది జట్టుకు శుభసూచకం. ఇంగ్లండ్‌పై ఇలాగే తొలి టెస్టు ఓడిన తర్వాత పుంజుకుని వరుసగా నాలుగు మ్యాచ్‌లు నెగ్గాం. ఒక మ్యాచ్ ఫలితంతోనో ఒక సిరీస్ ఫలితంతోనో జట్టు దృక్పథం మారదు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్
36 సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్టు మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. రెండో టెస్టులో టీమిండియా నుంచి గట్టి పోటీ ఎదురువుతుందని మాకు తెలుసు.
రెండో ఇన్నింగ్స్‌లో రెండో కొత్త బంతి తీసుకున్న తర్వాతే తిరిగి పోటీలోకి వచ్చాం. మా పేసర్లు చక్కటి బంతులతో టీమిండియాను కట్టడి చేయడంతో ఛేదన సులువైంది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర, టిమ్ సౌతీ మధ్య భాగస్వామ్యమే జట్టును గెలిపించింది. –టామ్ లాథమ్, న్యూజిలాండ్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment