ఒక మ్యాచ్.. పది హాఫ్ సెంచరీలు
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు ఆడిన 500వ చారిత్రక మ్యాచ్ లో అరుదైన చరిత్ర లిఖించబడింది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్యజరిగిన తొలి టెస్టులో పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం సరికొత్త రికార్డుకు దోహదం చేసింది. ఒక మ్యాచ్లో కనీసం ఒక్క సెంచరీ కూడా లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం టెస్టు చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే.
ఈ మ్యాచ్ భారత తొలి ఇన్నింగ్స్లో మురళీ విజయ(65), చటేశ్వర పూజారా(62)లు హాఫ్ సెంచరీలు చేయగా, న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ లో లాథమ్(58), విలియమ్సన్(75)లు అర్థ శతకాలు నమోదు చేశారు. కాగా, ఇరు జట్ల రెండో ఇన్నింగ్స్ లో మురళీ విజయ్(76),పూజారా(78), రోహిత్ శర్మ(68 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్), ల్యూక్ రోంచీ(80), సాంట్నార్(71)లు హాఫ్ సెంచరీలు సాధించారు. దాంతో మొత్తం సెంచరీ లేకుండా పది హాఫ్ సెంచరీలు నమోదు కావడం కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
ఈ మ్యాచ్లోభారత్ 197 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన తెలిసిందే. తన టెస్టు కెరీర్లో 500వ మ్యాచ్ ఆడిన భారత్ చారిత్రక గెలుపును సొంతం చేసుకుంది. చివరి రోజు ఆటలో అశ్విన్, షమీలు విజృంభించడంతో కివీస్ ఘోర పరాజయం చవిచూసింది.
మ్యాచ్ విశేషాలు..
భారత్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో ఒక న్యూజిలాండ్ ఆటగాడు ఐదు వికెట్లు, 50కు పైగా పరుగులు చేయడం 1988 తరువాత ఇదే తొలిసారి. సాంట్నార్ ఈ ఘనతను సాధించాడు. అంతకుముందు 1988-89 సీజన్లో జాన్ బ్రాస్ వెల్ ఐదు వికెట్లు, 50కి పైగా పరుగుల ఘనతను నమోదు చేశాడు.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చివరి ఐదు వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోవడం ఆ జట్టుకు రెండో అత్యల్పం. 1992-93 సీజన్లో న్యూజిలాండ్ చివరిసారి ఐదు పరుగులకు ఐదు వికెట్లను నష్టపోయింది.
తన కెరీర్ లో రెండో టెస్టు ఆడుతున్న ల్యూక్ రోంచీ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో రోంచీ హాఫ్ సెంచరీ చేయగా, అంతకుముందు అరంగేట్రం మ్యాచ్లో అర్థ శతకం నమోదు చేశాడు.