టీమిండియా 'జర్నీ' ఇలా..!
కొన్ని అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నప్పుడు గతాన్ని గుర్తు చేసుకోవడం సర్వ సాధారణం. ప్రస్తుత విజయాలను ఒకనాటి చేదు జ్ఞాపకాలతో ముడిపెట్టి చూస్తే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు టీమిండియా క్రికెట్ ఇదే జోష్ లో ఉంది. అంచెలంచెలుగా తన ప్రస్తానాన్ని కొనసాగించిన టీమిండియా చారిత్రక మ్యాచ్ లో అద్బుతమైన విజయాన్ని సాధించడమే ఇందుకు కారణం. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో 500 వ టెస్టు మ్యాచ్ ఆడటంతో ఈ ఘనతను సాధించిన మూడో జట్టుగా నిలిచిన భారత్.. అదే మ్యాచ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆ ఉత్సాహం మరింత రెట్టింపయ్యింది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో భారత్ 197 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే టీమిండియా తన టెస్టు ప్రయాణంలో ఎన్నో ఘనతలనే కాదు.. మరెన్నో మరచిపోలేని ఒడిదుడుకుల్ని ఎదుర్కొంది. తన టెస్టు ర్యాంకింగ్లో రెండో స్థానంలో ఉన్న భారత్.. ఓవరాల్గా 130 విజయాల్ని సాధించింది. ఈ సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో కొన్ని 'చారిత్రక' మ్యాచ్లను పరిశీలిద్దాం.
తొలి టెస్టు..
1932లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్తో భారత్ తన టెస్టు యాత్రను ఆరంభించింది. జూన్ 25 నుంచి 28 వరకూ జరిగిన భారత తొలి టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సీకే నాయుడు సారథ్యంలోని భారత జట్టు 158 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ను 259 పరుగుల కట్టడి చేసింది. పేసర్ మహ్మద్ నాసిర్ ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ను దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు డగ్లస్ జోర్డైన్, లెస్ ఆమ్స్లు అర్థ శతకాలు సాధించారు. అయితే ఆ తరువాత భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 189 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ సీకే నాయుడు 40 పరుగుల మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్ బిల్ బౌస్ నాలుగు వికెట్లు సాధించి భారత జట్టును దెబ్బ తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దాంతో భారత్కు 346 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, భారత్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 187 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమి చవిచూసింది. భారత ఆటగాళ్లలో అమర్ సింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు.ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగిసింది.
వందో టెస్టు మ్యాచ్..
భారత జట్టు వందో టెస్టు మ్యాచ్ కూడా ఇంగ్లండ్ తోనే జరగడం విశేషం. అయితే ఫలితంలో మార్పులేదు. ఈ మ్యాచ్లో కూడా ఇంగ్లండ్నే విజయం వరించింది. పటౌడీ ఆలీ ఖాన్ నేతృత్వంలో భారత్ ఆడిన మ్యాచ్ ఇది. 1967, జూలై 13 నుంచి 15 వరకూ ఎడ్జ్బాస్టన్ లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 132 పరుగులతో విజయం సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ 298 పరుగులు చేయగా, భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులకు ఆలౌటైంది. ఆ తరువాత ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ లో 203 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ రెండో ఇన్నింగ్స్ లో 277 పరుగులు చేసి ఓటమి పాలైంది. అజిత్ వాడేకర్ 70 పరుగులు చేయడం తప్ప మిగతా వారు ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ రెండో రోజు ఓవరాల్గా 20 వికెట్లు నేలరాలడం గమనార్హం. దీంతో ఈ మ్యాచ్ కూడా మూడు రోజుల్లోనే ముగిసిపోయింది.
200వ టెస్టు మ్యాచ్
1982, డిసెంబర్ 10 నుంచి 15 వరకూ లాహోర్లో పాకిస్తాన్తో భారత్ తన 200వ టెస్టు మ్యాచ్ను ఆడింది. సునీల్ గవాస్కర్ నేతృత్వంలో జరిగిన ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో 485 పరుగులు భారీ స్కోరు చేసింది. పాకిస్తాన్ దిగ్గజం జహీర్ అబ్బాస్(215) డబుల్ సెంచరీ సాధించి ఆ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 379 పరుగులు చేసింది. మొహిందర్ అమర్ నాథ్(109)రాణించడంతో భారత జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆ తరువాత పాక్ తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 135 పరుగుల వద్ద ఉండగా మ్యాచ్ డ్రా ముగిసింది.
300వ టెస్టు మ్యాచ్
1996, నవంబర్ 20 నుంచి 23 వరకూ అహ్మదాబాద్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచే భారత్కు 300వ టెస్టు. ఈ మ్యాచ్లో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ సచిన్ టెండూల్కర్ సారథ్యంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత తన తొలి ఇన్నింగ్స్లో 223 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 244 పరుగులు చేసింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ లో 190 పరుగులకు ఆలౌటైంది. అయితే పేసర్ జవగల్ శ్రీనాథ్ ఆరు వికెట్లు సాధించడంతో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్లో 105 పరుగులకే ఆలౌటై ఓటమి చెందింది. ఈ మ్యాచ్ లో వీవీఎస్ లక్ష్మణ్(51), సచిన్(42)లు రాణించారు.
400వ టెస్టు మ్యాచ్..
2006, జూన్ 30 నుంచి జూలై 2 వరకూ వెస్టిండీస్తో కింగ్స్టన్లో జరిగినే మ్యాచ్ భారత్కు 400వ టెస్టు మ్యాచ్. రాహుల్ ద్రవిడ్ నేతృత్వం వహించిన మ్యాచ్లో భారత్ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత తన తొలి ఇన్నింగ్స్లో 200 పరుగులకు ఆలౌట్ కాగా, వెస్టిండీస్ 103 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం భారత రెండో ఇన్నింగ్స్లో 171 పరుగులకే పరిమితమైంది. ఆపై విండీస్ను 219 పరుగులకే కట్టడి చేయడంతో భారత్ స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్(81,68)తో ఆకట్టుకున్నాడు. అయితే విండీస్ తొలి ఇన్నింగ్స్ ను కట్టడి చేయడంలో హర్భజన్ కీలక పాత్ర పోషించాడు. హర్భజన్ ఐదు వికెట్లతో సత్తా చాటి విండీస్కు అడ్డుకట్టవేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో పేసర్ శ్రీశాంత్ మూడు వికెట్లు సాధించాడు.