నవజ్యోత్ సింగ్ సిద్ధూ, ఇమ్రాన్ ఖాన్, కపిల్ దేవ్ (ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ/అమృత్‌సర్ : పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తాము హాజరవుతామని భారత దిగ్గజ క్రికెటర్లు తెలిపారు. పాకిస్తాన్ నూతన ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తానని భారత మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో 1992లో పాక్ జట్టు వన్డే ప్రపంచకప్ నెగ్గిన విషయాన్ని సిద్ధూ ప్రస్తావించారు. ఇమ్రాన్ నమ్మదగ్గ వ్యక్తి అని, వ్యక్తిత్వమున్న మంచి మనిషి అని సిద్ధూ కొనియాడారు. భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చేసేందుకు ఇమ్రాన్ కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు.
ఇదే విషయంపై హర్యానా ‘హరికేన్’ కపిల్ దేవ్ స్పందించారు. ఇమ్రాన్ నుంచి ఆహ్వానం అందిందో లేదో ఇంకా చెక్ చేసుకోలేదన్నారు. ఒకవేళ ఇమ్రాన్ నుంచి తనకు ఆహ్వానం అందినట్లయితే కచ్చితంగా పాకిస్తాన్‌కు వెళ్లి ప్రధానిగా ఇమ్రాన్ ప్రమాణ స్వీకారన్ని వీక్షిస్తానని చెప్పారు. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటానని కపిల్ స్పష్టం చేశారు. కాగా, టీమిండియా తొలిసారి 1983లో వన్డే ప్రపంచ కప్ నెగ్గింది కపిల్ సారథ్యంలోనే. ఈ నెల 11న ఇమ్రాన్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి భారత దిగ్గజ క్రికెటర్లు సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలతో పాటు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సైతం ఇమ్రాన్ ఆహ్వానం పంపించారని పీటీఐ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, తనకు ఇంతవరకు ఎలాంటి ఆహ్వానం అందలేదని ఆమిర్ వెల్లడించాడు. గావస్కర్ ఇంకా స్పందించాల్సి ఉంది.
మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి పలు కథనాలు హల్‌చల్ చేస్తున్న నేపథ్యంలో పాక్ విదేశాంగ శాఖ తాజాగా వివరణ ఇచ్చింది. ఆగస్టు 11న జరగనున్న ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతల (విదేశీ నేతలు)ను ఆహ్వానించడం లేదని స్పష్టం చేసింది. ఇమ్రాన్‌కు అత్యంత సన్నిహతులైన కొందరు విదేశీ వ్యక్తులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment