
'ధోనీ వంటి సెలెబ్రిటీల లక్ష్యం డబ్బు సంపాదనే'
ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది.
బెంగళూరు: ప్రజల మత విశ్వాసాలను కించపరిస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో టీమిండియా టి-20, వన్డే జట్ల కెప్టెన్ ధోనీ తెలుసుకోవాలని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. ఓ వాణిజ్య ప్రకటనలో ధోనీ హిందూ దేవుణ్ని అగౌరవపరిచాడంటూ ఆయనపై నమోదైన కేసును కర్ణాటక హైకోర్టు విచారించింది. ఉన్నత న్యాయస్థానం ధోనీ తీరును ఆక్షేపించింది.
'ధోనీ వంటి సెలెబ్రిటీలు కేవలం డబ్బు కోసమే యాడ్స్ చేస్తారు. వాటి పర్యవసానాల గురించి ఆలోచించరు. బాధ్యత లేకుండా యాడ్స్పై సంతకాలు చేస్తారు. వీటివల్ల ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించరు. వారి లక్ష్యం డబ్బు సంపాదించడం మాత్రమే' అని కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎన్ వేణుగోపాల్ గౌడ అన్నారు. షూలు ధరించి, చేతిలో పలు వస్తువులు పట్టుకుని, విష్ణుమూర్తి రూపంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ఓ బిజినెస్ మేగజైన్ కవర్ పేజీలో ప్రచురించడంపై సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమత్ ఫిర్యాదు చేశారు.
కాగా కవర్ పేజీపై ప్రకటన కోసం ధోనీ డబ్బులు తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ గౌడ స్పందిస్తూ.. డబ్బులు తీసుకోనట్టుగా నిర్దారిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ధోనీని అదేశించారు. కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.