సాక్షి, గుంటూరు: జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మూడోరోజు ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ ఖాతాలో పతకం చేరింది. స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సోమవారం జరిగిన మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో జి. కార్తీక (ఏపీ) కాంస్య పతకాన్ని సాధించింది. ఆమె 12.51 మీ. దూరం జంప్ చేసి మూడో స్థానంలో నిలవగా, షీనా (12.78మీ., కేరళ), జోలిన్ లోబో (12.52మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజతాలను గెలుచుకున్నారు. 20, 000 మీ. రేస్ వాక్ ఈవెంట్‌లో సౌమ్య విజేతగా నిలిచింది. ఆమె గంటా 42 నిమిషాల 23.68 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుంది. మహిళల పోల్‌వాల్ట్ ఈవెంట్‌లో ఖ్యాతి వఖారియా (కర్ణాటక) 3.70 మీ. జంప్ చేసి చాంపియన్‌గా నిలిచింది. జావెలిన్ త్రో విభాగంలో అన్నూరాణి (54.29మీ.), పూనమ్ రాణి (51.14మీ., హరియాణా), రష్మీ శెట్టి (47.76మీ., కర్నాటక) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు.