నాయర్ అజేయ ట్రిపుల్
చెన్నై:ఇంగ్లండ్ తో చివరిదైన నాల్గో టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న నాయర్(303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అజేయంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. నాయర్ తన డబుల్ సెంచరీ సాధించే క్రమంలో 23 ఫోర్లను, సిక్సర్ ను మాత్రమే కొట్టగా, మరో వంద పరుగుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు సాధించాడు.
కరుణ్ నాయర్ మూడొందల మార్కును చేరే క్రమంలో తన చివరి 50 పరుగులను సాధించడానికి 33 బంతులను మాత్రమే ఆడాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ రోజు ఆటలో అతనికి జతగా అశ్విన్ (67), జడేజా(51)లు రాణించారు. అయితే కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన తరువాత భారత తన ఇన్నింగ్స్ ను 759/7 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్ టెస్టుల్లో అత్యధిక స్కోరును సాధించింది. 2009లో ముంబైలో జరిగిన టెస్టులో శ్రీలంకపై భారత్ 726 పరుగులే భారత్ కు ఇప్పటివరకూ టాప్ స్కోర్. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది.