ముప్పైని మూడొందలుగా మార్చాడు!
చెన్నై: కరుణ్ నాయర్... ఆడుతున్న మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ సాధించి ఎంతో మంది ప్రశంసలు అందుకున్న క్రికెటర్. భారత్ నుంచి కేవలం వీరేంద్ర సెహ్వాగ్కు మాత్రమే సాధ్యమైన ఆ అరుదైన ఘనతను సాధించిన ఆటగాడు. దాంతో పాటు తొలి సెంచరీని డబుల్గా మార్చిన మూడో భారత క్రికెటర్గా, మొదటి శతకాన్ని ట్రిపుల్ గా మార్చిన ప్రపంచ మూడో బ్యాట్స్మన్గా గుర్తింపు పొందాడు. అయితే ఇక్కడ కరుణ్ నాయర్కు అదృష్టం రెండు విధాల కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ మ్యాచ్కు ముందు నాయర్ స్థానంలో మరో భారత ఆటగాడు మనీష్ పాండే తుది జట్టులో ఆడే అవకాశం ఉందనే వాదన వినిపించింది. అందుకు కారణం అంతకుముందు నాయర్ ఆడిన రెండు మ్యాచ్ల్లో ఘోరంగా విఫలం కావడమే.
ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా మొహాలీ టెస్టుల ద్వారా అరంగేట్రం చేసిన నాయర్.. ఆ తరువాత ముంబైలో టెస్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఆ రెండు టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన నాయర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో నాయర్ స్థానంలో మనీష్ కు అవకాశం కల్పించాలనే అనుకున్నారు. ఇది భారత్ కు నామ మాత్రపు టెస్టే కావడంతో ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తారనే అంతా భావించారు. అయితే ఈ కర్ణాటక కుర్రాడిపై నమ్మకం ఉంచిన అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లిలు మళ్లీ మరొక అవకాశం ఇచ్చి చూశారు. దాన్ని చక్కగా వినియోగించుకున్న నాయర్ ఇప్పుడు రికార్డుల ధీరుడిగా మారిపోయాడు.
కాగా, నాయర్ కు మరొక అదృష్టం కలిసొచ్చింది. భారత తొలి ఇన్నింగ్స్ లో భాగంగా మూడో రోజు ఆటలో నాయర్ 34 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 85.0 ఓవర్లో ఇంగ్లిష్ బౌలర్ బాల్ వేసిన బంతికి నాయర్ కాస్త తడబడ్డాడు. కొద్దిగా స్వింగ్ అవుతూ వచ్చిన బంతిని నాయర్ గట్టిగా కొట్టాడు. ఆ క్రమంలోనే బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న కుక్ చేతుల్లోంచి దాటుకుని బౌండరీకి తరలిపోయింది. ఈ క్షణంలో కాస్త అప్రమత్తంగా ఉండి ఉంటే క్యాచ్ ను పట్టుకోవడం కూడా కష్టం కాదనే అనిపించింది. ఒకవేళ కుక్ ఆ క్యాచ్ ను పట్టివుంటే నాయర్ ఇన్నింగ్స్ అప్పుడే ముగిసేది. కాకపోతే క్రికెట్లో క్యాచ్లను వదిలివేయడం సాధారణంగా జరిగే పరిణామమే అయినప్పటికీ నాయర్ కు అదృష్టం ఇలా కలిసొచ్చిందనే చెప్పాలి. ఆ తరువాత ఎటువంటి అవకాశం ఇవ్వని నాయర్ ట్రిపుల్ తో చెలరేగిపోయాడు. ఆ క్రమంలోనే భారత అభిమానులకు పండుగ చేశాడు.