కరుణ్ నాయర్ 'ట్రిపుల్' సరిపోలేదా?
ముంబై:ఇంగ్లండ్ తో చివరిదైన ఐదో టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో ఆద్యంతం ఆకట్టుకున్న నాయర్(303 నాటౌట్;381 బంతుల్లో 32 ఫోర్లు 4 సిక్సర్లు) అజేయంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ఇదే క్రమంలో తొలి సెంచరీని ట్రిపుల్ సెంచరీగా మార్చిన ఏకైక భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. దాంతో ఇంగ్లండ్తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్లో నాయర్కు ఛాన్స్ ఖాయంగా కనబడింది. యువ క్రికెటర్లకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పుకుంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సెలక్టర్లు నాయర్కు అవకాశం ఇస్తారనే అంతా భావించారు.
అయితే చెన్నై టెస్టులో విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఆ మళయ మారుతానికి అవకాశం దక్కలేదు. ఇక్కడ ఇద్దరు వెటరన్ క్రికెటర్లను ఎంపిక చేసిన సెలక్టర్లు.. నాయర్ను పక్కన పెట్టేశారు. ధోని కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తరువాత యువరాజ్ జట్టులోకి రాగా, అనూహ్యంగా ఆశిష్ నెహ్రాకు కూడా ఇంగ్లండ్ తో తదుపరి సిరీస్లో చోటు కల్పించారు.
వచ్చే వరల్డ్ కప్కు బీసీసీఐ ఓ వ్యూహంతో వెళుతుందని భావించి సరిపెట్టుకున్నా, మరొక అంశాన్ని మాత్రం ఇక్కడ ప్రస్తావించక తప్పదు. ఇంగ్లండ్తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా భారత్-ఎ జట్టులో కూడా నాయర్కు సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. భారత్ ఆడబోయే రెండు ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కూడా అతనికి అవకాశం ఇవ్వలేదు. అంటే కనీసం ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడటానికి కూడా నాయర్ సరిపోడా అనే ప్రశ్న తలెత్తుంది. ఈ వార్మప్ మ్యాచ్లో ఎంతో మంది యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వగా, నాయర్ను మాత్రం పట్టించుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్లో లేని సంజూ శాంసన్, అంబటి రాయుడులకు ప్రాక్టీస్ మ్యాచ్లో చోటు కల్పించిన సెలక్టర్లు.. ట్రిపుల్ కొట్టిన వీరుడ్ని పక్కన పెట్టేశారు. అతని ప్రతిభ సెలక్టర్ల దృష్టిలో పడలేదా?లేక ఆ ట్రిపుల్ ఏదో యాధృచ్ఛికంగా చేసింది మాత్రమేనని సెలక్టర్లు భావించారా? అనేది మాత్రం వారి విజ్ఞానానికే వదిలేయాలి.
నెహ్రా అవసరం ఉందా?
సగటు క్రీడా అభిమానికి తలెత్తి ఒకే ఒక్క ప్రశ్న భారత వెటరన్ బౌలర్ ఆశిష్ నెహ్రా ఎంపిక. ఇంగ్లండ్ తో మూడు ట్వంటీ 20ల సిరీస్లో నెహ్రాను ఎంపిక చేసిన సెలక్టర్ల నిర్ణయం ఆశ్చర్యపరిచేదే. దాదాపు పది నెలల తరువాత టీ 20 జట్టులోకి వచ్చిన నెహ్రా ఎంత వరకూ రాణిస్తాడు అనేది మాత్రం ప్రశ్నార్థకం. వరల్డ్ టీ 20లో భాగంగా మార్చినెలలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో నెహ్రా చివరిసారి పాల్గొన్నాడు. ఆ మ్యాచ్లో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసిన నెహ్రా ఆశించిన ప్రదర్శన కూడా ఏమీ చేయలేదు. ఆ తరువాత నుంచి ఇంటికే పరిమితమైన నెహ్రాను అనూహ్యంగా జట్టులోకి తీసుకున్నారు.
వచ్చే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసే సెలక్టర్లు నెహ్రాను ఎందుకు ఎంపిక చేసినట్లు. ప్రస్తుతం 38వ ఒడిలో ఉన్న నెహ్రా.. ఆ వరల్డ్ కప్ నాటికి పూర్తిస్థాయి ఫిట్నెస్తో ఉంటాడా?అనేది సెలక్టర్లకే తెలియాలి. ఇప్పటికే ఫిట్నెస్ పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న నెహ్రా.. వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్కు ఎంపిక చేసే భారత జట్టులో చోటు దక్కించుకోవడం కష్టం కూడా. 2019లో ఆడబోయే వన్డే వరల్డ్ కప్కే యువ క్రికెటర్లకు చోటు కల్పించాలనే దిశగా బీసీసీఐ పయనిస్తోంది. ఆ క్రమంలోనే ధోని కూడా తన పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడనేది అందరికీ విదితమే. ఇక్కడ ఎంతో మంది యువ బౌలర్లు ఉండగా, నెహ్రాకు ఎందుకు చోటు కల్పించినట్లు. ఒకవైపు యువ క్రికెటరైన నాయర్ కు చోటు ఇవ్వని సెలక్టర్లు.. వెటరన్ బౌలర్ అయిన నెహ్రాకు ఏ ఉద్దేశంతో అవకాశం ఇచ్చారనేది మింగుడు పడని ప్రశ్నే.