246వ ర్యాంకర్‌ చేతిలో చుక్కెదురు  | kashyap out of Russia Open badminton | Sakshi
Sakshi News home page

246వ ర్యాంకర్‌ చేతిలో చుక్కెదురు 

Published Thu, Jul 26 2018 12:57 AM | Last Updated on Thu, Jul 26 2018 12:57 AM

kashyap out of Russia Open badminton - Sakshi

వ్లాదివోస్టాక్‌ (రష్యా): పూర్వ వైభవం కోసం తపిస్తున్న భారత మాజీ నంబర్‌వన్‌ పారుపల్లి కశ్యప్‌కు మరో నిరాశాజనక ఓటమి ఎదురైంది. రష్యా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ వరల్డ్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ రెండో రౌండ్‌లోనే నిష్క్రమించాడు. ప్రపంచ 246వ ర్యాంకర్‌ ర్యొటారో మరువో (జపాన్‌)తో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 48వ ర్యాంకర్, నాలుగో సీడ్‌ కశ్యప్‌ 34 నిమిషాల్లో 12–21, 11–21తో పరాజయం పాలయ్యాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన కశ్యప్‌ తన ప్రత్యర్థికి ఏదశలోనూ పోటీనివ్వలేకపోయాడు. గతవారం సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీలో భారత్‌కే చెందిన సౌరభ్‌ వర్మతో జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో కశ్యప్‌ కేవలం 15 నిమిషాల్లోనే ఓడిపోయాడు. హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్, చిట్టబోయిన రాహుల్‌ యాదవ్‌తోపాటు భారత ఆటగాళ్లు అజయ్‌ జయరామ్, చిరాగ్‌ సేన్, బోధిత్‌ జోషి, ప్రతుల్‌ జోషి కూడా రెండో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో గురుసాయిదత్‌ 14–21, 8–21తో వ్లాదిమర్‌ మల్కోవ్‌ (రష్యా) చేతిలో... రాహుల్‌ యాదవ్‌ 21–23, 11–21తో సౌరభ్‌ వర్మ (భారత్‌) చేతిలో... చిరాగ్‌ సేన్‌ 14–21, 21–16, 16–21తో పాబ్లో అబియాన్‌ (స్పెయిన్‌) చేతిలో... అజయ్‌ జయరామ్‌ 21–15, 14–21, 15–21తో శుభాంకర్‌ డే (భారత్‌) చేతిలో... బోధిత్‌ జోషి 8–21, 14–21తో సిద్ధార్థ్‌ ప్రతాప్‌ సింగ్‌ (భారత్‌) చేతిలో... ప్రతుల్‌ జోషి 12–21, 21–18, 13–21తో మిషా జిల్బెర్‌మన్‌ (ఇజ్రాయెల్‌) చేతిలో ఓడిపోయారు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వృశాలి 
మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్‌ అమ్మాయి గుమ్మడి వృశాలితోపాటు రితూపర్ణ దాస్, ముగ్ధా అగ్రే ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించగా... చుక్కా సాయి ఉత్తేజిత రావు, వైదేహి చౌదరీ ఓడిపోయారు. వృశాలి 21–11, 21–16తో ఎలీనా కొమెన్‌ద్రవోస్కాజా (రష్యా)పై, రితూపర్ణ దాస్‌ 21–11, 21–18తో విక్టోరియా (రష్యా)పై, ముగ్ధ 21–16, 21–19తో యిన్‌ ఫమ్‌ లిమ్‌ (మలేసియా)పై గెలుపొందారు. సాయి ఉత్తేజిత 21–14, 15–21, 18–21తో బ్యోల్‌ లిమ్‌ లీ (కొరియా) చేతిలో... వైదేహి 13–21, 15–21తో క్రిస్టిన్‌ కుబా (ఎస్తోనియా) చేతిలో ఓటమి చవిచూశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement