చరిత్ర సృష్టించిన కవిత.. వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతనారి సంచలనం సృష్టించారు. సల్వార్ కమీజ్ ధరించి మరీ ఆమె చేసిన పోరాటం అభిమానులను కట్టిపడేసింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఆమె పోరాటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ (WWE)లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా గతంలో గ్రేట్ ఖాలీ సంచలనం సృష్టించాడు. హెవీ వెయిట్ ఛాంపియన్‌షిప్ గెలిచి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హరియాణాకు చెందిన రెజ్లర్ కవితా దేవీ అదే పనిచేశారు. ఈ రింగ్‌లో అడుగుపెట్టిన భారత తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
ఇటీవల జరిగిన మే యంగ్ క్లాసిక్ టోర్నీలో న్యూజిలాండ్ రెజ్లర్ డకోటా కైతో ఆమె తలపడి తన ప్రతాపం చూపించారు. ప్రత్యర్థిని తన కండబలంతో పలుమార్లు పైకి ఎగరేసి కింద పడేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కవిత ఓడినా తన పోరాటంతో మెప్పించారు. ఇక్కడ నెటిజన్లను అమితంగా ఆకర్షించింది ఆమె వస్త్రధారణ. కాషాయ రంగు సల్వార్ కమీజ్ ధరించిన కవిత నడుం చుట్టూ దుపట్టా కట్టుకొని కుస్తీ పట్టిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఆ వీడియోను 35 లక్షల మంది వీక్షించారు. వెయిట్ లిఫ్టర్ అయిన కవితా దేవి 2016 ఏసియా గేమ్స్‌లో 75 కేజీల విభాగంలో స్వర్ణాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.