కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని
సాక్షి, స్పోర్ట్స్ : అంతర్జాతీయ మ్యాచుల్లో బౌలింగ్ చేయమని సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని సూచించడంతోనే తన కెరీర్ మలుపు తిరిగిందని టీమిండియా ఆల్‌రౌండర్ కేదార్ జాదవ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ వేలంలో జాదవ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) రూ. 7.8 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎస్‌కేకు ఎంపికవడంపై జాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు.
‘నేను భారత్ తరుపున బౌలింగ్ చేసి వికెట్లు పడగొడుతానని కలలో కూడా అనుకోలేదు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయమని ధోని భాయ్ అడిగినప్పటి నుంచే నేను భిన్నమైన ఆటగాడిగా మారనని అనుకుంటున్నా. ధోని ప్రతి ఆటగాడికి ఎంతో ప్రోత్సాహం అందిస్తాడు. ప్రతి ఆటగాడు ప్రతిభను చాటుకునే అవకాశం కల్పిస్తాడు. ఇక ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. ఇదే ధోనిలోని అత్యుత్తమ లక్షణం. చెన్నై జట్టుకు ఆడేందుకు ఏమైనా చేయొచ్చు. ధోని భాయ్ మైదానంలో ఉంటే చాలు నా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి నా సాయశక్తుల ప్రయత్నిస్తా. గత పదేళ్లుగా సీఎస్‌కే ఐపీఎల్‌లో అత్యుత్తమ జట్టుగా కొనసాగుతోంది. అలాంటి జట్టుకు ఆడటం అదృష్టం. ధోని నుంచి ఎంతో నేర్చుకోవాలని అనుకుంటున్నా.’ అని జాదవ్ సీఎస్‌కే వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment