
క్రికెటర్ చేతిపై బాక్సర్ అలీ టాటూ!
లండన్:మూడు దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో పోరాడి శనివారం శాశ్వత నిద్రలోకి జారుకున్న బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ కి అనేక మంది క్రీడాకారులు ఘనమైన నివాళులు అర్పించారు. అయితే ఇంగ్లండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మాత్రం అలీకి నివాళిగా చేతిపై టాటూ వేయించుకుని తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. మొహ్మద్ అలీ బాక్సింగ్ రింగ్లో తలపడుతున్నట్లు ఉన్న ఫోటోను పీటర్సన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.
ఇదిలా ఉంచితే ఈ క్రీడాకారులిద్దరూ తమ తమ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టి వార్తల్లో నిలిచినవారే. తన ఆచరించిన ధర్మ కోసం వియత్నాంపై అమెరికా యుద్ధం చేయడాన్ని అలీ వ్యతిరేకించాడు. ఇక ఇంగ్లండ్ క్రికెటర్ గా గుర్తింపు పొందిన కెవిన్ పీటర్సన్ దక్షిణాఫ్రికాలో జన్మించి ఇంగ్లండ్ క్రికెటర్ గా ఎదిగాడు. దక్షిణాఫ్రికాలో జాతి సంబంధిత పద్దతిలో క్రికెటర్లను ఎంపికచేయడాన్ని పీటర్సన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దీంతో అక్కడ నుంచి ఇంగ్లండ్కు వచ్చి క్రికెటర్ గా ప్రత్యేక గుర్తింపు పొందాడు.