
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ క్రీడాకారులు కేయూర మోపాటి, ప్రాషి జోషి శుభారంభం చేశారు. విజయవాడలో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో కేయూర 21–19, 20–22, 21–17తో క్వాలిఫయర్ కె. వైష్ణవి (తెలంగాణ)పై పోరాడి గెలవగా... మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ ప్రాషి జోషి 21–10, 21–14తో అనురియా దాస్ (పశ్చిమ బెంగాల్)ను అలవోకగా ఓడించి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ (ఆంధ్రప్రదేశ్) 21–17, 21–15తో నిషిత డేంబ్లా (హరియాణా)పై గెలుపొందగా... సూర్య చరిష్మా (ఆంధ్రప్రదేశ్) 18–21, 21–18, 11–21తో ఆద్య వరియత్ (కేరళ) చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్‌లో తొమ్మిదో సీడ్ డి. జశ్వంత్ (ఆంధ్రప్రదేశ్) ముందంజ వేశాడు.
జశ్వంత్ 21–19, 21–8తో సిద్దేశ్ హుడేకర్ (మహారాష్ట్ర)ను ఓడించి రెండోరౌండ్‌లో అడుగుపెట్టాడు. ఇతర మ్యాచ్‌ల్లో విజేత (తెలంగాణ) 11–21, 8–14తో రిటైర్డ్‌హర్ట్‌గా శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ నవనీత్–సాహితి జోడీకి తొలిరౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలిరౌండ్‌లో అర్జున్ (కేరళ)–మనీషా (ఆర్‌బీఐ) ద్వయం 22–20, 22–20తో నవనీత్–సాహితి జంటపై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్ శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–కావ్య గాంధీ (ఢిల్లీ) జంట 21–15, 15–21, 21–13తో రెండో సీడ్ ఉత్కర్‡్ష అరోరా (ఢిల్లీ)–కరిష్మా వాడ్కర్ (మహారాష్ట్ర) జోడీపై, గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మమూరి యాదవ్ (గుజరాత్) జంట 21–19, 17–21, 21–13తో హిమాన్షు సరోహా–అనురియా దాస్ (పశ్చిమ బెంగాల్) జంటపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకున్నాయి.