కింగ్స్‌ పంజాబ్‌ జోరు | Kings Punjab beat Delhi by 4 runs | Sakshi
Sakshi News home page

కింగ్స్‌ పంజాబ్‌ జోరు

Published Mon, Apr 23 2018 11:40 PM | Last Updated on Mon, Apr 23 2018 11:41 PM

Kings Punjab beat Delhi by 4 runs - Sakshi

ఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో కింగ్స్‌ పంజాబ్‌ జోరు కొనసాగుతోంది. సోమవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కింగ్స్‌ పంజాబ్‌ తన 144 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని ఢిల్లీపై గెలుపొందింది.  తద్వారా వరుసగా నాల్గో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఢిల్లీ ఐదో ఓటమిని చవిచూసింది. కింగ్స్‌ తో మ్యాచ్‌లో ఢిల్లీ తడబడి ఓటమి పాలైంది.  శ్రేయస్‌ అయ్యర్‌(57) ఒంటరి పోరాటం చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అతనికి జతగా పృథ్వీ షా(22), రాహుల్‌ తెవాతియా(24) మాత్రమే ఆడటంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కింగ్స్‌ బౌలర్లలో అన్‌కిత్‌ రాజపుత్‌, ఆండ్రూ టై, ముజిబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ ఆద్యంతం తడబాటుకు గురైంది. ఏ ఒక్క బ్యాట్స్‌మెన్‌ మెరుపులు మెరిపించకపోవడంతో కింగ్స్‌ పంజాబ్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ అరోన్‌ ఫించ్‌(2) తీవ్రంగా నిరాశపరచగా, కేఎల్‌ రాహుల్‌(23), మయాంక్‌  అగర్వాల్‌(21)లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆపై గేల్‌ స్థానంలో వచ్చిన డేవిడ్‌ మిల్లర్‌(26) కూడా విఫలమయ్యాడు.

పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో కరుణ్‌ నాయర్‌(34)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఏ దశలోనూ కింగ్స్‌ పంజాబ్‌ను ఢిల్లీ బౌలర్లు కోలుకోనీయకుండా చేశారు. ప్రధానంగా ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఇంగ్లిష్‌ బౌలర్‌ లియామ్‌ ప్లంకెట్‌ అదరగొట్టాడు. కింగ్స్‌ పంజాబ్‌ మూడు ప్రధాన వికెట్లను తీయడంతో పాటు మెరుపులాంటి క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. తన నాలుగు ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం మరో విశేషం. అతనికి జతగా అవీష్‌ ఖాన్‌, బౌల్ట్‌ తలో రెండు వికెట్లు సాధించగా, డానియల్‌ క్రిస్టియన్‌ వికెట్‌ తీశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement