రాహుల్ సరికొత్త రికార్డు
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యంత నిలకడగా ఆడిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సిరీస్లో భాగంగా చివరిదైన నాల్గో టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రాహుల్ రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 60 పరుగులు చేసిన రాహుల్.. రెండో ఇన్నింగ్స్ లో 51 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ ఘన విజయం సాధించడంలో సహకరించాడు. అయితే ఈ సిరీస్లో రాహుల్ సాధించిన హాఫ్ సెంచరీలు సంఖ్య ఆరు. రాహుల్ ఏడు ఇన్నింగ్స్ ల్లో (64,10,90,51,67,60,51) ఆరు అర్ధ శతకాల్ని సాధించాడు.
తద్వారా ఆసీస్ పై ఒక సిరీస్లో యాభైకి పైగా పరుగుల్నిఅత్యధిక సార్లు సాధించిన తొలి భారత ఓపెనర్గా రాహుల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే మురళీ విజయ్ సాధించిన రికార్డును రాహుల్ అధిగమించాడు. 2014-15 సీజన్ లో మురళీ విజయ్ భారత ఓపెనర్ గా ఐదు సార్లు 50కి పైగా పరుగుల్ని సాధించి రికార్డును నెలకొల్పాడు. అయితే తాజా సిరీస్ లో ఆస్ట్రేలియాలో చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా మురళీ విజయ్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచిన రాహుల్.. మరో హాఫ్ సెంచరీ చేసి సిరీస్ను కొత్త రికార్డుతో ముగించాడు.
నాల్గో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ కు తోడు రహానే రాణించడంతో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకుంది. నాల్గో రోజు ఆట తొలి సెషన్లో రాహుల్-రహానేలు దాటిగా ఆడటంతో భారత్ ఘన విజయం సాధించింది.