దుబాయ్: ఇప‍్పటికే ఎన్నో రికార్డులను సాధించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా రేటింగ్ పాయింట్లతో సరికొత్త ఘనతను కోహ్లి సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో ఒకేసారి వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా పాయింట్లు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లి 909 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టకున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో 558 పరుగులతో విశేషంగా రాణించడంతో తన రేటింగ్ పాయింట్లను కోహ్లి మరింత పెంచుకున్నాడు.
అంతకుముందు టెస్టుల్లో 912 రేటింగ్ పాయింట్లను కోహ్లి సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒకే సమయంలో ఏబీ డివిలియర్స్ తర్వాత టెస్టు, వన్డే ఫార్మాట్లలో 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. మరొకవైపు వన్డేల్లో 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక భారత క్రికెటర్ కోహ్లినే కావడం ఇక‍్కడ విశేషం. గతంలో సచిన్ టెండూల్కర్ ఒక్కడే 887 వన్డే రేటింగ్ పాయింట్లను సాధించాడు. అయితే రెండు ఫార్మాట్లలో 900పైగా రేటింగ్ పాయింట్లను సాధించిన ఐదుగురు ఆటగాళ్లలో కోహ్లి ఒకడిగా గుర్తింపు సాధించాడు.
అయితే ఆల్ టైమ్ వన్డే రేటింగ్ పాయింట్ల ఘనత విండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ పేరిట ఉంది. రిచర్డ్స్ 935 రేటింగ్ పాయింట్లతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను నమోదు చేశాడు. ఇదిలా ఉంచితే, 25 ఏళ్ల తర్వాత వన్డేల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించిన ఆటగాడు కోహ్లినే. 1993లో వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా 911 వన్డే రేటింగ్ పాయింట్లను సాధించగా, ఆపై అత్యధిక రేటింగ్ పాయింట్లను కోహ్లి సాధించాడు.
ఇక వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత పేసర్ జస్ర్పిత్ బూమ్రా నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. బూమ్రా రెండు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్‌ను సాధించాడు. అయితే ఆఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. వీరిద్దరూ 787 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు టాప్‌కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment