అదో మంచి ప్రయోగం: కోహ్లి
నాగ్ పూర్:ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య నవంబర్ 27నుంచి అడిలైడ్ లో జరుగనున్న తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ను టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్వాగతించాడు. టెస్టులను డే అండ్ నైట్ మ్యాచ్ లుగా నిర్వహిస్తే సాంప్రదాయ క్రికెట్ కు మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్నాడు. మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కోహ్లి.. డే అండ్ నైట్ టెస్టు నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ పెద్దలు తీసుకున్ననిర్ణయం నిజంగా అద్భుతమైనదిగా అభివర్ణించాడు. ఇది ఓ మంచి ప్రయోగంగా కోహ్లి పేర్కొన్నాడు.
కాగా, ఆ మ్యాచ్ ల కు వాడే పింక్ బాల్ పై కోహ్లి కాస్త అనుమానం వ్యక్తం చేశాడు. కొంతమంది ఆటగాళ్లు తెలిపిన సమాచరం మేరకు డే అండ్ నైట్ టెస్టులకు పింక్ బంతి సరైనది కాదని పేర్కొంటున్నట్లు కోహ్లి తెలిపాడు. అటు పగలు, ఇటు రాత్రి పింక్ బాల్ తో మ్యాచ్ నిర్వహణకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా.. సూర్యుడు అస్తమించే సమయంలో పింక్ బంతితో ఆడటం కష్టతరంగా మారే అవకాశం ఉందని కోహ్లి ఈ సందర్భంగా పేర్కొన్నాడు.