దినేశ్ కార్తీక్, నితీష్ రానా
జైపూర్ : ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ రాజస్తాన్‌ను సొంత గడ్డపైనే మట్టికరిపించింది. రాబిన్ ఉతప్ప, సునీల్ నరైన్ లకు తోడు చివర్లో నితీష్ రానా, దినేశ్ కార్తీక్‌లు రాణించడంతో రాజస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో కోలకతా ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ కోల్‌కతా బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రహానే 36(19 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సు), డీఆర్సీ షార్ట్ 44 (43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్ 24(18 బంతుల్లో 2 ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
ఉతప్ప.. నరైన్‌ల దూకుడు..
ఇక లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కృష్ణప్ప గౌతమ్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే క్రిస్‌లీన్ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప.. మరో ఓపెనర్ సునీల్ నరైన్‌తో ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ దశలో నరైన్ 35 (25 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్) రనౌట్‌గా వెనుదిరగడంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన నితీష్ రానాతో కలిసి ఉతప్ప దాటిగా ఆడాడు. అయితే గౌతమ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన ఉతప్ప 48(36 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్స్‌లు).. బౌండరీ లైన్ వద్ద బెన్‌స్టోక్స్ అద్భుత క్యాచ్‌తో తృటిలో హాఫ్ సెంచరీ మిస్సయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన దినేశ్ కార్తీక్ 42 నాటౌట్ (23 బంతులు, 2 ఫోర్లు, 2 సిక్స్ ), రానా 35 నాటౌట్ (27 బంతులు, 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి ఆచితూచి ఆడుతూ మిగతా పనిని పూర్తి చేశాడు. దీంతో 7 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా విజయాన్నందుకుంది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment