పెద్దలు చెప్పారనే మాట్లాడుకున్నాం! | Koneru Humpy to get married | Sakshi
Sakshi News home page

పెద్దలు చెప్పారనే మాట్లాడుకున్నాం!

Published Wed, Aug 6 2014 1:07 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

పెద్దలు చెప్పారనే మాట్లాడుకున్నాం! - Sakshi

పెద్దలు చెప్పారనే మాట్లాడుకున్నాం!

‘మీ ఇష్టం... ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను’... ఓ అమ్మాయి ఈ మాట చెబితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారు..? కోనేరు హంపి తండ్రి అశోక్ కూడా ఇలాంటి ఆనందమే పొందారు. చదరంగంలో ఎత్తులన్నింటినీ ఔపోసన బట్టిన క్రీడాకారిణి... తన జీవితంలోని అతి ముఖ్యమైన ‘ఎత్తును మాత్రం తండ్రికే వదిలేసింది. ‘నా మంచి చెడ్డలు నాకంటే నా తల్లిదండ్రులకే ఎక్కువ తెలుసు’ అనేది హంపి ఆలోచన. అందుకే తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోంది. ఈ నెల 13 రాత్రి దాసరి అన్వేష్‌తో హంపి పెళ్లి. ఈ సందర్భంగా కాబోయే భార్యాభర్తలు తమ పెళ్లి గురించి, కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ప్రత్యేకంగా ‘సాక్షి’ పాఠకుల కోసం...
 
 ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్... ఇలా ప్రపంచం చాటింగ్‌తో దూసుకుపోతోంది. అమ్మాయి ప్రపంచాన్ని చుట్టొచ్చిన సెలబ్రిటీ... అబ్బాయి అమెరికాలో చదువుకుని వ్యాపారం చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే... అర్ధరాత్రి దాకా ముచ్చట్లు ఉంటాయి. కానీ కోనేరు హంపి, అన్వేష్ మాత్రం నిశ్చితార్థం ముందు వరకు మాట్లాడుకోలేదు.  ఎంగేజ్‌మెంట్ తేదీ ఖరారయింది. అప్పటికీ ఇద్దరూ మాట్లాడుకోలేదు. సిగ్గుపడుతున్నారు. తల్లిదండ్రులే మాట్లాడుకోమని చెప్పారు. అప్పుడే తొలిసారి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు ఇది కాస్త ‘పాత’గా అనిపించినా... హంపి, అన్వేష్ ఇద్దరూ పెద్దలకు ఎంత గౌరవం ఇచ్చారనడానికి ఉదాహరణ. ఈ కాబోయే దంపతులు పెళ్లి గురించి చెప్పిన విశేషాలు.
 
 అంతకుముందు చూడలేదు
 ‘మధ్యవర్తుల ద్వారా ఓ సంబంధం వచ్చిందని నాన్నగారు చెప్పి ఫొటో చూపించారు. తెలిసిన కుటుంబం. సెలైంట్‌గా ఉండే కుటుంబం. మంచి సంబంధం అని చెప్పారు. అంతా మీ ఇష్టమే అని చెప్పాను. అంతకుముందే ఏవో ఫంక్షన్స్‌లో ఎదురుపడినట్లున్నాం. కానీ ప్రత్యేకంగా తనని ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. నిశ్చితార్థానికి తేదీ ఖరారు అయ్యే వరకు కూడా తనతో మాట్లాడలేదు. అన్వేష్ కూడా ఫోన్ చేయలేదు. ఒకసారి మాట్లాడుకోండి అని మా నాన్న చెప్పారు. అన్వేష్‌తో కూడా వాళ్ల పెద్దవాళ్లు చెప్పినట్లున్నారు. తనతో మాట్లాడాక మరింత సంతోషం వేసింది. నా లక్ష్యాలేమిటో చెప్పాను. చెస్‌లో నేను సాధించాలనుకుంటున్న విషయాలన్నీ తనతో పంచుకున్నాను. నా కెరీర్‌కు కావలసిన పూర్తి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చాడు.

ఇన్నాళ్లూ నాన్న నన్ను నడిపించారు. నాలుగేళ్ల వయసులో చెస్ బోర్డు పట్టుకున్నప్పటి నుంచి ఆయనే నా కె రీర్‌ను తీర్చిదిద్దారు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇకపై అన్వేష్ నా గురించి, నా కెరీర్ గురించి పూర్తిగా కేర్ తీసుకుంటాడు. వివిధ టోర్నీల కోసం ఎక్కువగా రకరకాల దేశాలు తిరుగుతూ ఉండాలి. నా కెరీర్‌ను తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్న కోరిక ఇప్పటివరకు తీరలేదు. పెళ్లయ్యాక ఆ కలను నెరవేర్చుకుంటానేమో.’    
 - హంపి
 
సెలబ్రిటీని చేసుకుంటానని అనుకోలేదు
 ‘విద్య జీవనంలో భాగం. పని చేసుకుంటూ చదువుకోవాలి... అనే కాన్సెప్ట్‌తో పెరిగాను. నాన్నగారు ఎఫ్‌ట్రానిక్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. అమెరికాలో బీఈ చేశాను. నిజానికి అక్కడే స్థిరపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ నాకు మాత్రం ఇక్కడ ఉండటమే ఇష్టం. అందుకే నాన్నతో చెప్పి చదువు అయిపోగానే వచ్చేశాను. మా కంపెనీలోనే ఆర్ అండ్ డీ విభాగంలో బాధ్యతలు తీసుకున్నాను. కోనేరు హంపి సంబంధం గురించి పెద్దవాళ్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను.
 
 
 ఎందుకంటే ఓ సెలబ్రిటీని చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాను. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తేదీ ఖరారయినా.. మాట్లాడాలంటే కాస్త సిగ్గు అనిపించింది. అసలు మాట్లాడుకోకుండా ఏమిటి? అంటూ ఇంట్లోవాళ్లు అన్న తర్వాతే మాట్లాడాను. హంపికి తన కెరీర్ గురించి, భవిష్యత్ గురించి చాలా క్లారిటీ ఉంది. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.’    
 - అన్వేష్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement