కుంబ్లేనే కోచ్?
ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు
కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మంగళవారం ఏడుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరిలో అనిల్ కుంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్ నేరుగా కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు విదేశీయులు టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ప్రజెంటేషన్‌ను అందించారు.
కమిటీ తన నివేదికను బుధవారం బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కేకు సమర్పించే అవకాశం ఉంది. 24న జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో అధికారికంగా కోచ్ పేరును ప్రకటిస్తారు. అయితే అనిల్ కుంబ్లేనే కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాల సమాచారం. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ త్రయం రవిశాస్త్రికంటే తమ మాజీ సహచరుడి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసిందని, ఇకపై ఎవరినీ ఇంటర్వ్యూకు పిలవడం లేదని గంగూలీ ప్రకటించారు. అనూహ్యంగా భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్‌కు మాత్రం పిలుపు రాలేదు.