
లంక పోరాటం
ఊహించినట్టుగానే భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను చుట్టేశారు.
►ఫాలోఆన్ రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 209/2
►కుశాల్ మెండిస్ శతకం
►సెంచరీకి చేరువలో కరుణరత్నే
►తొలి ఇన్నింగ్స్‌లో లంక 183 ఆలౌట్
►అశ్విన్‌కు ఐదు వికెట్లు
ఊహించినట్టుగానే భారత బౌలర్లు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను చుట్టేశారు. అశ్విన్ ధాటికి ఆ జట్టు కేవలం 183 పరుగులకే కుప్పకూలింది. అయితే 439 పరుగులు వెనకబడిన దశలో ఫాలోఆన్‌కు దిగాక లంక ఆటతీరులో మార్పు కనిపించింది. టెస్టు సిరీస్‌లో తొలిసారిగా ఆతిథ్య జట్టు పోరాడుతోంది. కుశాల్ మెండిస్, కరుణరత్నే భారత బౌలర్లపై ఎదురుదాడి చేసి క్రీజులో నిలిచారు. దీంతో తొలి సెషన్‌లో ఎనిమిది వికెట్లు తీయగలిగిన భారత్.. ఆ తర్వాత రెండు సెషన్లలో కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టింది. మెండిస్, కరుణరత్నే మధ్య రెండో వికెట్‌కు ఏకంగా 191 పరుగులు జత చేరాయి. అయితే ఇంకా 230 పరుగులు వెనకబడి ఉన్న శ్రీలంక నాలుగోరోజు భారత బౌలర్ల ముందు ఏమేరకు నిలుస్తుందో వేచి చూడాలి.
కొలంబో: తొలి టెస్టులో నాలుగు రోజుల్లోనే ఓటమిని అంగీకరించిన శ్రీలంక రెండో టెస్టులో మాత్రం అనూహ్య పోరాటాన్ని ప్రదర్శిస్తోంది. ఫాలోఆన్ ఆడుతున్న లంకను కుశాల్ మెండిస్ (135 బంతుల్లో 110; 17 ఫోర్లు), ఓపెనర్ కరుణరత్నే (200 బంతుల్లో 92 బ్యాటింగ్; 12 ఫోర్లు) వీరోచిత ఆటతీరుతో ఆదుకున్నారు. ఫలితంగా మూడో రోజు శనివారం ఆట ముగిసేసమయానికి ఆతిథ్య జట్టు 60 ఓవర్లలో 2 వికెట్లకు 209 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నేతో పాటు పుష్పకుమార (2 బ్యాటింగ్) ఉన్నాడు. అయితే ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవడానికి లంక ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు స్పిన్నర్ ఆర్.అశ్విన్ (5/69) మాయాజాలానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. డిక్‌వెల్లా (48 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేదు. దీంతో భారత్‌కు 439 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. జడేజా, షమీలకు రెండేసి వికెట్లుదక్కాయి.
సెషన్–1 వికెట్లు టపటపా
మూడో రోజు బరిలోకి దిగిన లంకను స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఆటాడుకున్నారు. తమ వైవిధ్యమైన బంతులతో కుదురుకోనీయకుండా దెబ్బతీశారు. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 14 పరుగులు జోడించగానే లంక రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత డిక్‌వెల్లా, మాథ్యూస్ (26) జోడి కొద్దిసేపు పోరాడింది. అయితే అశ్విన్... మాథ్యూస్‌ను అవుట్ చేయడంతో ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వేగంగా ఆడిన డిక్‌వెల్లా 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 42వ ఓవర్‌లో షమీ అతడిని బౌల్డ్ చేయడంతో లంక పోరాటం ముగిసినట్టయ్యింది. అశ్విన్‌కు తోడు జడేజా కూడా విరుచుకుపడటంతో వారి ఇన్నింగ్స్ స్వల్ప స్కోరుకే ముగిసింది.
ఓవర్లు: 20.3, పరుగులు: 133, వికెట్లు: 8
సెషన్–2 మెండిస్, కరుణరత్నే జోరు
లంచ్ విరామం అనంతరం కెప్టెన్ కోహ్లి లంకను ఫాలోఆన్‌కు ఆహ్వానించాడు. అయితే మూడో ఓవర్‌లోనే ఉమేశ్ యాదవ్.. తరంగ (2)వికెట్ తీసి షాక్ ఇచ్చాడు. ఈ దశలో మెండిస్, కరుణరత్నే మాత్రం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా మెండిస్ వన్డే తరహాలో దూకుడును ప్రదర్శిస్తూ స్వీప్‌షాట్లతో చెలరేగాడు. ఎనిమిదో ఓవర్‌లో మెండిస్ క్యాచ్‌ను ధావన్ అందుకోలేకపోయాడు. ఇక జడేజా వేసిన ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో మెండిస్ ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. దీంతో 53 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తయ్యింది. అటు కరుణరత్నే 83 బంతుల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. ఓవర్‌కు నాలుగు పరుగుల చొప్పున రాబట్టిన ఈ జోడి మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లింది.
ఓవర్లు: 29, పరుగులు: 118, వికెట్లు: 1
సెషన్–3 మెండిస్ శతకం
టీ బ్రేక్ అనంతరం కూడా భారత బౌలర్లు చెమటోడ్చాల్సి వచ్చింది. ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా జాగ్రత్తగా ఆడుతూ మెండిస్, కరుణరత్నే జోడి ముందుకుసాగింది. అయితే పరుగుల వేగం తగ్గింది. 120 బంతుల్లో మెండిస్ సెంచరీ సాధించాడు. ఈ దశలో పాండ్యాను బరిలోకి దించిన కోహ్లి వ్యూహం ఫలితాన్నిచ్చింది. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అతను 55వ ఓవర్‌లో విడదీశాడు. వికెట్ కీపర్ సాహా పట్టిన క్యాచ్‌తో మెండిస్ సూపర్ ఇన్నింగ్స్ ముగిసింది. అలాగే రెండో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. మరో ఐదు ఓవర్ల అనంతరం లంక మూడో రోజు ఆటను ముగించింది.
ఓవర్లు: 31, పరుగులు: 91, వికెట్లు: 1
► 2 భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన రెండో బౌలర్.. తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జడేజా గుర్తింపు.