కోహ్లి సేన కొత్త చరిత్ర
►విదేశీ గడ్డపై తొలిసారి 3–0తో క్లీన్ స్వీప్
►శ్రీలంకపై ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో గెలుపు
►మూడో రోజే ముగిసిన చివరి టెస్టు
►అశ్విన్‌కు నాలుగు వికెట్లు
తమ టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. అతిరథ మహారథులెందరికో సాధ్యం కాని ఘనతను విరాట్ కోహ్లి సేన సాధించి చూపించింది. దశాబ్దాలుగా అందకుండా ఊరిస్తున్న విదేశీ గడ్డపై మూడు టెస్టుల సిరీస్ క్లీన్‌స్వీప్‌ను అదిరిపోయే రీతిలో దక్కించుకుంది. సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టును భారత్ మూడో రోజే ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో చేజిక్కించుకుంది. అశ్విన్ స్పిన్ మాయకు తోడు షమీ పదునైన బంతులకు శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. అలాగే వరుసగా ఎనిమిదో టెస్టు సిరీస్‌ను భారత్ తమ ఖాతాలో వేసుకుంది.
పల్లెకెలె: ఊహించిన ఫలితమే వచ్చింది. సిరీస్ ఆద్యంతం పూర్తి ఆధిపత్యం వహించిన టీమిండియా ఆఖరి టెస్టులో శ్రీలంకను మరింత వణికించింది. సోమవారం మూడోరోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ ఏమైనా పోరాడతారేమోనని భావించినా భారత బౌలింగ్ ధాటికి పేకమేడలా కుప్పకూలారు. కచ్చితంగా చెప్పాలంటే రెండున్నర రోజుల్లోనే లంక మ్యాచ్‌ను అప్పగించింది. దీంతో కోహ్లి సేన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఈ సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఈ మాదిరి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3–1తో నెగ్గింది. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌లు కూడా ఐదు రోజుల పాటు సాగకపోవడం భారత్ ఆధిపత్యాన్ని చూపుతోంది.
74.3 ఓవర్లపాటు సాగిన లంక రెండో ఇన్నింగ్స్ టీ విరామానికి కాస్త ముందు 181 పరుగుల వద్ద ముగిసింది. వికెట్ కీపర్ డిక్వెలా (52 బంతుల్లో 41; 5 ఫోర్లు), కెప్టెన్ చండిమాల్ (89 బంతుల్లో 36; 4 ఫోర్లు), మాజీ కెప్టెన్ మాథ్యూస్ (96 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణించారు. స్పిన్నర్ అశ్విన్‌కు నాలుగు, షమీకి మూడు వికెట్లు దక్కాయి. హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... రెండు సెంచరీలతో అదరగొట్టిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది.
ఓవర్‌నైట్ స్కోరు 19/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంక మూడో ఓవర్లోనే రెండో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో కరుణరత్నే (16) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత షమీ ఎక్స్ట్రా బౌన్స్ బంతులతో విజృంభించి తన వరుస ఓవర్లలో పుష్పకుమార (1), కుశాల్ మెండిస్ (12)లను అవుట్ చేసి లంక పతనానికి బీజం వేశాడు. ఈ దశలో చండిమాల్, మాథ్యూస్ ఓర్పుగా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. ఎలాంటి భారీ షాట్లకు పోకుండా పూర్తి రక్షణాత్మకంగా ఆడి ఈ జోడి లంచ్ విరామానికి వెళ్లింది. దీంతో తొలి గంటలో మూడు వికెట్లు తీసిన భారత్ ఆ తర్వాత ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది.
లంచ్ బ్రేక్ తర్వాత పది ఓవర్ల పాటు లంక ఇన్నింగ్స్ సజావుగానే సాగింది. కానీ 51వ ఓవర్లో నిదానంగా కుదురుకుంటున్న ఈ సీనియర్ ఆటగాళ్ల జోడీని కుల్దీప్ విడదీశాడు. చండిమాల్ షార్ట్ లెగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను రహానే పట్టేయడంతో ఐదో వికెట్‌కు 65 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. మరో మూడు ఓవర్ల తర్వాత మాథ్యూస్‌ను అశ్విన్ ఎల్బీగా అవుట్ చేయడంతో లంక పోరాటం ఆశలు ఆవిరయ్యాయి. అటు డిక్వెలా కాస్త ధాటిగా ఆడినా మరో ఎండ్‌లో అతడికి సహకరించే వారు కరువయ్యారు. టెయిలెండర్లను అశ్విన్ చకచకా పెవిలియన్‌కు పంపడంతో పాటు డిక్వెలాను ఉమేశ్ యాదవ్ అవుట్ చేయడంతో రెండో సెషన్ ముగియక ముందే లంక వైట్‌వాష్‌కు గురైంది.
ఈ సిరీస్ ద్వారా టీమిండియాకు మేలు చేసిన అంశమేదైనా ఉంటే అది హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం. ఈ మూడు మ్యాచ్‌ల్లో అతను పరిణతి చెందిన విధానం ఆకట్టుకుంది. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ బంతితో పాటు బ్యాట్‌తోనూ చెలరేగి జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇది జట్టుకు మంచి సమతూకాన్ని ఇచ్చింది. యువకులతో కూడిన మా జట్టు ఇదే ఆటతీరుతో మున్ముందు సిరీస్‌లలో కూడా ఆడుతుంది. మరో ఐదారేళ్ల పాటు జట్టుకు ఆడగలిగే ఆటగాళ్లు ఉన్నారు.
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
►1 విదేశీ గడ్డపై మూడు అంతకన్నా ఎక్కువ టెస్టు మ్యాచ్‌లతో నిర్వహించిన సిరీస్‌లో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి. ఇంటా బయట కలిపి ఓవరాల్‌గా ఐదోసారి.
► 1 తొలి ఇన్నింగ్స్‌లో మూడు సార్లు 300+ పరుగుల ఆధిక్యం సాధిండం భారత్‌కు ఇదే తొలిసారి.
► 9 శ్రీలంకలో భారత్ సాధించిన టెస్టు విజయాలు. ఇక్కడ మరే పర్యాటక జట్టు ఇన్ని విజయాలు సాధించలేదు.
► 2 విదేశీ గడ్డపై జరిగిన సిరీస్‌లో భారత బ్యాట్స్‌మెన్ అత్యధికంగా ఐదు సెంచరీలు చేయడం ఇది రెండోసారి.