
ఘనంగా ముగించారు
సొంతగడ్డపై ప్రపంచకప్‌కు ముందు భారత్ తమ ‘ప్రాక్టీస్’ను విజయవంతంగా ముగించింది.
ఉక్కు నగరంలో ప్రత్యర్థిని తుక్కు చేసేశారు. మళ్లీ సంచలనం ఆశించిన జట్టుకు వారి స్థాయి ఏమిటో చూపించారు. గత మ్యాచ్‌లాగే ఇప్పుడూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన ధోని సేన, శ్రీలంకకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా సిరీస్‌ను అద్భుత విజయంతో ముగించింది. అశ్విన్ మాయాజాలానికి ఐదు ఓవర్లలోపే చేతులెత్తేసిన లంకేయులు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన టీమిండియా విశాఖ వాసులకు విజయానందాన్ని పంచింది. మొత్తానికి మెగా టోర్నీ చేరువలో ఉన్న సమయంలో తమ టి20 బలమేంటో మరోసారి భారత్ చూపించింది.
మూడో టి20లో భారత్ విజయం
* 9 వికెట్లతో చిత్తయిన శ్రీలంక
* 2-1తో సిరీస్ ధోని సేన సొంతం
* అశ్విన్‌కు నాలుగు వికెట్లు
* టీమిండియా నంబర్‌వన్ ర్యాంక్ పదిలం
సాక్షి, విశాఖపట్నం: సొంతగడ్డపై ప్రపంచకప్‌కు ముందు భారత్ తమ ‘ప్రాక్టీస్’ను విజయవంతంగా ముగించింది. శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది.
తొలి టి20లో అనూహ్య పరాజయం అనంతరం వెంటనే కోలుకున్న ధోని సేన తమదైన శైలిలో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్లతో శ్రీలంకపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 18 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. షనక (19)దే అత్యధిక స్కోరు. భారత బౌలర్లలో అశ్విన్ (4-1-8-4) అద్భుత గణాంకాలు నమోదు చేశాడు. అనంతరం భారత్ 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 84 పరుగులు చేసింది.
శిఖర్ ధావన్ (46 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రహానే (22 నాటౌట్) రెండో వికెట్‌కు 51 బంతుల్లో 55 పరుగులు జోడించి విజయం ఖాయం చేశారు. అశ్విన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారాలు దక్కాయి. తాజా ఫలితంతో భారత జట్టు టి20ల్లో తమ నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంది.
అశ్విన్ ధాటికి విలవిల: తొలి మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన భారత్, ఈసారి లంకకు దానిని రుచి చూపించింది. అశ్విన్ అద్భుత స్పిన్‌ను ఏ మాత్రం అంచనా వేయలేక లంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ప్రత్యర్థిని కదలనీయకుండా చేసి ఉచ్చులో పడేసిన అశ్విన్ మూడో బంతికి డిక్‌వెలా (1), చివరి బంతికి దిల్షాన్ (1)లను పెవిలియన్‌కు పంపించాడు. తన మరుసటి ఓవర్లో కెప్టెన్ చండీమల్ (8)ను అవుట్ చేసిన అతను, ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో గుణరత్నే (4) పని పట్టాడు.
నెహ్రా దెబ్బకు సిరివర్దన (4) బౌల్డ్ కావడంతో పవర్‌ప్లేలోపే లంక సగం వికెట్లు కోల్పోయింది. యువరాజ్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాది షనక దూకుడు ప్రదర్శించినా... అదే ఓవర్లో జడేజా అద్భుత ఫీల్డిం గ్‌కు ప్రసన్న (9) రనౌట్ కావడంతో లంక దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆ తర్వాత రైనా (2/6), జడేజా (1/11) స్పిన్ మంత్రం కూడా తోడు కావడంతో లంక ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతోసేపు పట్టలేదు. లంక ఇన్నింగ్స్‌లో షనక, పెరీరా (12) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు.
ధావన్ దూకుడు: గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా ధావన్ తన జోరు ప్రదర్శించాడు. రోహిత్ (13) తొందరగానే అవుటైనా... ధావన్ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. అతనికి రహానే అండగా నిలవడంతో భారత్‌కు ఏ దశలోనూ ఇబ్బంది ఎదురు కాలేదు. ఫలితంగా మరో 37 బంతులు మిగిలి ఉండగానే వీరిద్దరు మ్యాచ్‌ను ముగించడం విశేషం.
1
భారత్ తరఫున టి20ల్లో అశ్విన్ (4/8)దే అత్యుత్తమ బౌలింగ్. గతంలో తన పేరిటే ఉన్న (4/11) రికార్డును అతను సవరించాడు.
3
ధోని, రైనా తర్వాత 50 టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్ రోహిత్ శర్మ.
శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతోనే మా విజయావకాశాలు పెరిగాయి. అశ్విన్ చాలా బాగా బౌలింగ్ చేశాడనేది నిజమే అయినా మిగతావారంతా అతనికి అండగా నిలిచారు. అప్పుడప్పుడు ఒకటి, రెండు మ్యాచ్‌లలో ఓటమి ఎదురు కావచ్చు. కానీ మన ఆటలో లోపం ఉండరాదు. నిలకడ కొనసాగితే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఎనిమిదేళ్ల ఐపీఎల్ అనుభవంతో భారత్‌లో మైదానాలపై మంచి అవగాహన ఉంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే ఇలాంటి పరిస్థితులు మనకు అనుకూలించడం సంతోషకరం. దీని వల్ల కొన్ని భిన్నమైన ప్రణాళికలకు అవకాశం ఉంటుంది. అభిమానులనుంచి ఒత్తిడి సహజం కానీ మేం మాత్రం ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి పెడుతూ ముందుకు వెళతాం.
-ధోని, భారత కెప్టెన్
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: డిక్‌వెలా (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 1; దిల్షాన్ (ఎల్బీ) (బి) అశ్విన్ 1; చండీమల్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 8; గుణరత్నే (సి) రైనా (బి) అశ్విన్ 4; సిరివర్దన (బి) ఆశిష్ నెహ్రా 4; షనక (బి) రవీంద్ర జడేజా 19; ప్రసన్న (రనౌట్) 9; పెరీరా (సి) జడేజా (బి) సురేశ్ రైనా 12; సేననాయకే (సి) ధోని (బి) సురేశ్ రైనా 8; చమీరా (నాటౌట్) 9; ఫెర్నాండో (బి) జస్‌ప్రీత్ బుమ్రా 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 82.
వికెట్ల పతనం: 1-2; 2-3; 3-12; 4-20; 5-21; 6-48; 7-54; 8-72; 9-73; 10-82.
బౌలింగ్: అశ్విన్ 4-1-8-4; నెహ్రా 2-0-17-1; బుమ్రా 3-0-10-1; జడేజా 4-1-11-1; యువరాజ్ 1-0-15-0; పాండ్యా 2-0-13-0; రైనా 2-0-6-2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) చమీరా 13; ధావన్ (నాటౌట్) 46; రహానే (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 84.
వికెట్ల పతనం: 1-29.
బౌలింగ్: సేననాయకే 4-0-22-0; ఫెర్నాండో 2-0-7-0; చమీరా 2-0-14-1; ప్రసన్న 1-0-3-0; సిరివర్దన 1-0-9-0; గుణరత్నే 2.5-0-22-0; దిల్షాన్ 1-0-4-0.