
అశ్విన్ మరో రికార్డు
ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు.
కొలంబో: ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న టీమిండియా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన అశ్విన్.. టెస్టుల్లో రెండు వేల పరుగుల మార్కును చేరాడు. తద్వారా టెస్టుల్లో రెండు వేల పరుగుల్ని, 200 వికెట్లను వేగవంతంగా సాధించిన రెండో భారత్ ఆల్ రౌండర్ గా అశ్విన్ నిలిచాడు. ఓవరాల్ గా చూస్తే ఈ ఫీట్ ను వేగవంతంగా సాధించిన నాల్గో ఆల్ రౌండర్ అశ్విన్. అంతకుముందు ఇయాన్ బోథమ్(ఇంగ్లండ్), ఇమ్రాన్ ఖాన్(పాకిస్తాన్),కపిల్ దేవ్(భారత్)లు ఈ ఘనత ఫాస్ట్ గా సాధించిన ఆల్ రౌండర్లు.
మరొకవైపు టెస్టుల్లో రెండు వేల పరుగులు, 250 వికెట్లు సాధించిన నాల్గో భారత క్రికెటర్ గా అశ్విన్ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లేలు అశ్విన్ కంటే ముందున్నారు. అయితే రెండు వేల పరుగులు, 275 వికెట్లు సాధించిన ఘనతను ఫాస్ట్ గా సాధించిన వారిలో అశ్విన్ దే తొలిస్థానం కావడం మరో విశేషం. ఇక్కడ రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అశ్విన్ అధిగమించాడు. హ్యడ్లీ 58 టెస్టుల్లో ఈ ఘనతను సాధించాడు. లంకేయులతో జరిగే రెండో టెస్టు ద్వారా అశ్విన్ 51వ టెస్టును ఆడుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఖాతాలో 2004 టెస్టు పరుగులు, 281 టెస్టు వికెట్లు ఉన్నాయి.
Ravichandran Ashwin is part of quite an elite club in being the fourth fastest to reach the 2,000 runs - 200 wickets double in Tests #SLvInd pic.twitter.com/c4YaRDQqcl
— ICC (@ICC) 4 August 2017