
బ్రూసెల్స్: గతేడాది జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గి ఈ ఫీట్‌ను సాధించిన రెండో భారతీయ షట్లర్‌గా గుర్తింపు పొందిన లక్ష్యసేన్.. ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకున్నాడు. బెల్జియం ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్‌ను లక్ష్యసేన్ కైవసం చేసుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్.. తన కంటే ఎంతో మెరుగైన రెండో సీడ్ విక్టర్ స్వెండ్‌సెన్(డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. 34 నిమిషాలు పాటు జరిగిన పోరులో లక్ష్యసేన్ 21-14, 21-15 తేడాతో స్వెండ్‌సెన్‌ను మట్టికరిపించాడు.
తొలి గేమ్‌లో 13-12తో ఆధిక్యంలో నిలిచిన లక్ష్య సేన్ అదే జోరును ఆ తర్వాత కూడా కొనసాగించాడు. ఆ క‍్రమంలోనే తొలి గేమ్‌ను గెలిచి పట్టు సాధించాడు. ఇక రెండో గేమ్‌లో దూకుడుగా ఆడాడు. తొలుత 6-2 ఆధిక్యంలో నిలిచిన లక్ష్య సేన్.. వరుసగా ఐదు పాయింట్లు సాధించి 11-3తేడాతో దూసుకుపోయాడు. ఆపై స్వెండ్‌సెన్ ప్రతి ఘటించినా గేమ్‌ను నిలబెట్టుకోలేపోయాడు. దాంతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుని టైటిల్‌ను సాధించి 18 ఏళ్ల లక్ష్య సేన్ చాంపియన్‌గా అవతరించాడు.