లలిత్‌బాబు విజయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్‌బాబు ఎనిమిదో రౌండ్ గేమ్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ వాసిలీ పాపిన్‌కు షాకిచ్చాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ‘ఎ’ కేటగిరీ ఎనిమిదో రౌండ్ పోటీలో ఏపీ ఆటగాడు చక్కని ఎత్తులతో రష్యన్ ప్రత్యర్థిని నిలువరించాడు. 34 ఎత్తుల్లోనే వాసిలీ ఆటకట్టించాడు.
తాజా విజయంతో అతను 6 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. చెన్నైకి చెందిన గ్రాండ్‌మాస్టర్ సేతురామన్ ఆరున్నర పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. అతను మిఖాయిల్ మొజరోవ్ (రష్యా, 6)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.
సంచలన విజయాలతో దూసుకెళ్తున్న ఏపీ కుర్రాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ (5)కు ఎనిమిదో రౌండ్‌లో చుక్కెదురైంది. ఆర్మేనియా గ్రాండ్‌మాస్టర్ శామ్‌వెల్ టెర్-సహక్యాన్ (6) చేతిలో బాలచంద్ర కంగుతిన్నాడు. ఏడో రౌండ్‌దాకా సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగిన అతను తాజా పరాజయంతో ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయాడు. ‘బి’ కేటగిరీలో జరిగిన ఏడో రౌండ్ గేముల్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు వరుణ్, విశ్వనాథ్ ప్రసాద్, లక్ష్మీసందీప్ నాయుడు, సాయి అగ్ని జీవితేశ్, ప్రతీక్ శ్రీవాస్తవ, ఎస్. ఖాన్, కల్యాణ్ కుమార్ విజయాలు నమోదు చేశారు.
బి-కేటగిరీ ఏడో రౌండ్ ఫలితాలు
వరుణ్ (ఏపీ, 6.5)... సుబ్రమణ్యం (తమిళనాడు)పై, విశ్వనాథ్ ప్రసాద్ (ఏపీ, 6.5)... రమణబాబు (ఏపీ, 5)పై, లక్ష్మీ సందీప్ (ఏపీ, 6)... విజయ్ ఆనంద్ (తమిళనాడు, 5)పై, సాయి అగ్ని జీవితేశ్ (ఏపీ, 5.5)... నయన్‌దీప్ (డీఏఎస్‌సీబీ, 4.5)పై, కళ్యాణ్ కుమార్ (ఏపీ, 5)... బైవబ్ (ఒడిశా, 4)పై, ఎస్.ఖాన్ (ఏపీ, 5)... రాజేంద్ర (రాజస్థాన్, 4)పై, ప్రతీక్ (ఏపీ, 5)... రూప్ సౌరవ్ (బీహార్, 4)పై నెగ్గారు.