విదేశీ గడ్డపై అద్భుత ఫలితాలు సాధించగల సత్తా ఉన్న జట్టు ఇది అంటూ ఇంగ్లండ్‌తోసిరీస్‌కు ముందు భారత కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలు ఉత్త మాటలేనని రుజువైపోయింది. బ్యాటింగ్ వైఫల్యంతో టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 1–3తో అప్పగించేసింది.ఇక మిగిలింది గౌరవప్రదంగా ఇంగ్లండ్ పర్యటనకు గుడ్‌బై చెప్పడం. ఇక్కడ 2011 సిరీస్‌లో 0–4తో చిత్తుగా ఓడిన భారత్, 2014లో 1–3తో కోల్పోయింది. నాటి జట్లకంటే తమదిబలమైనదిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న కోహ్లి సేన మరో విజయంతో గత సిరీస్ కంటే మెరుగైన ఫలితాన్ని ఇవ్వగలదా... లేక మరింత అవమాన భారంతో
వెనుదిరుగుతుందా అనేది ఆఖరి టెస్టులో తేలనుంది.
లండన్: ఇంగ్లండ్ గడ్డపై భారత జట్టు సుదీర్ఘ పర్యటన ముగింపు అంకానికి చేరుకుంది. టి20 సిరీస్ గెలిచి వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టెస్టు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. మూడో టెస్టులో గెలిచినా, తర్వాతి మ్యాచ్‌లో అదే ఊపును కొనసాగించలేక చతికిలపడింది. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇక్కడి ఓవల్ మైదానంలో చివరిదైన ఐదో టెస్టులో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. సిరీస్ ఫలితాన్ని 2–3గా మార్చి అంతరం తగ్గించాలని కోహ్లి సేన భావిస్తుండగా... తమ దేశం తరఫున దిగ్గజ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అలిస్టర్ కుక్‌కు విజయంతో వీడ్కోలు పలకాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది. ఏదేమైనా రెండు జట్ల బలబలాల విషయంలో పెద్దగా తేడా లేకపోవడంతో మరో హోరాహోరీ పోరు మాత్రం ఖాయం.
అశ్విన్ స్థానంలో జడేజా!
తన కెప్టెన్సీలో తొలిసారి తుది జట్టులో మార్పులు లేకుండా సౌతాంప్టన్‌లో బరిలోకి దిగిన కోహ్లి దానికి తగిన ఫలితం మాత్రం రాబట్టలేకపోయాడు. అశ్విన్ పూర్తి ఫిట్‌గా లేకుండానే మ్యాచ్ ఆడినట్లు విమర్శలు వచ్చాయి. అతడికి విశ్రాంతినిచ్చి సిరీస్‌లో తొలిసారి రవీంద్ర జడేజాను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం టీమ్ ప్రాక్టీస్ చూస్తే ఇది దాదాపుగా ఖరారైనట్లే అనిపించింది. బౌలర్లు చెలరేగినా, బ్యాటింగ్ వైఫల్యమే సిరీస్‌లో భారత్ కొంప ముంచింది. కాబట్టి మరో అదనపు బ్యాట్స్‌మన్‌ను ఆడించాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే హార్దిక్ పాండ్యా స్థానం లో ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి వైపు మొగ్గు కనిపిస్తోంది. అయితే టూర్‌లో ఇప్పటి వరకు టీమ్‌తో ఉన్న కరుణ్ నాయర్‌కు అవకాశం ఇవ్వకుండా విహారిని ఆడిస్తారా అనేది ఆసక్తికరం. ఆసియా కప్‌కు ముందు విశ్రాంతి కావాలని భావిస్తే బుమ్రాను కూడా పక్కన పెట్టిన ఉమేశ్‌ను ఆడించవచ్చని తెలుస్తోంది. ఓపెనర్‌గా పృథ్వీ షాను ప్రయత్నించాలని డిమాండ్లు వస్తున్నా మరోసారి ధావన్, లోకేశ్ రాహుల్‌కే అవకాశం దక్కవచ్చు. వీరిద్దరు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాలని భారత్ కోరుకుంటోంది. కోహ్లి అద్భుత ఫామ్‌పై ఎలాంటి సందేహాలు లేకపోయినా... పుజారా, రహానే కూడా స్థాయికి తగిన ప్రదర్శన ఇస్తేనే ఓవల్‌లో గెలుపు అవకాశాలు ఉంటాయి.
భావోద్వేగాల మ్యాచ్...
ఇంగ్లండ్ మరోసారి మ్యాచ్‌కు ముందు రోజే తుది జట్టును ప్రకటించింది. నాలుగో టెస్టులో గెలిచిన టీమ్‌లో ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే బట్లర్ స్థానంలో బెయిర్‌స్టో కీపర్ బాధ్యతలు తీసుకున్నాడు. ప్రయోగం విఫలమైనా, మొయిన్ అలీని మళ్లీ మూడో స్థానంలోనే ఆడించనుంది. సిరీస్ గెలుచుకోవడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మ్యాచ్ ఫలితమే కాకుండా ఇప్పుడు అందరి దృష్టి మాజీ కెప్టెన్ కుక్‌పై నిలిచింది. ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కుక్ కెరీర్‌లో వరుసగా 159వ టెస్టు బరిలోకి దిగబోతున్నాడు. వరుస వైఫల్యాలతో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అతను కనీసం తన ఆఖరి మ్యాచ్‌లోనైనా మెరుగ్గా ఆడతాడా అనేది చూడాలి. కుక్‌లాగే పూర్తిగా విఫలమైన మరో ఓపెనర్ జెన్నింగ్స్‌పై ఇంగ్లండ్ ఇప్పటికీ నమ్మకముంచి మరో అవకాశం ఇచ్చింది. నాలుగు మ్యాచ్‌లలో కూడా ఎలాంటి ప్రభావం చూపకపోయినా రషీద్‌ను కొనసాగించడం ఆశ్చర్యకరం. అన్నింటికి మించి తన కెరీర్‌లో ఇంత చెత్తగా ఎప్పుడూ ఆడని జో రూట్ తప్పులు దిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ మినహా అతను ప్రతీసారి విఫలమయ్యాడు. జట్టు సీనియర్ బౌలర్లు అండర్సన్, బ్రాడ్ తమపై ఉన్న అంచనాలను చాలా వరకు అందుకోవడం ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చే విషయం.
►మరో 56 పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లి నాలుగోసారి ఓ సిరీస్‌లో 600 పరుగులమైలురాయి దాటుతాడు. మరో 88 పరుగులు చేస్తే ఇంగ్లండ్‌పై
సిరీస్‌లో అత్యధికపరుగులు చేసిన క్రికెటర్‌గా మొహమ్మద్ యూసుఫ్(పాకిస్తాన్–631 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమిస్తాడు.
► ఇంగ్లండ్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా గుర్తింపు పొందేందుకు ఇషాంత్ శర్మ నాలుగు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌లో కపిల్‌దేవ్ 13 టెస్టుల్లో 43 వికెట్లు తీయగా... ఇషాంత్ 11 మ్యాచ్‌ల్లో కలిపి 40 వికెట్లు పడగొట్టాడు.
► ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లండ్), మైకేల్ క్లార్క్, క్రిస్ రోజర్స్ (ఆస్ట్రేలియా) తర్వాత ఓవల్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన నాలుగో క్రికెటర్‌గా కుక్ గుర్తింపు పొందనున్నాడు.
తుది జట్లు
భారత్ (అంచనా): కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్/పృథ్వీ షా, పుజారా, రహానే, కరుణ్ నాయర్/హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, షమీ, బుమ్రా.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, అలీ, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, కరన్, రషీద్, బ్రాడ్, అండర్సన్.
పిచ్, వాతావరణం
ఓవల్ వికెట్ కూడా ఈ సిరీస్‌లోని మిగతా పిచ్‌లలాగే కనిపిస్తోంది. ఆరంభంలో పేస్ ప్రభావం ఉంటుంది. గట్టిగానిలదొక్కుకోగలిగితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. సౌతాంప్టన్‌లాగే చివర్లో స్పిన్ ప్రభావం ఖాయం కాబట్టి మళ్లీ టాస్ కీలకం కానుంది. కోహ్లి ఈ సిరీస్‌లో నాలుగు సార్లూ టాస్ ఓడిపోయాడు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు.
►మ.గం. 3.30 నుంచి సోనీ సిక్స్, సోనీ టెన్–3లలో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment