ఆశలు రేపి...  ఆవిరి చేసి!  | Last test match also india loss | Sakshi
Sakshi News home page

ఆశలు రేపి...  ఆవిరి చేసి! 

Published Wed, Sep 12 2018 1:15 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

Last test match also india loss - Sakshi

గెలవాలంటే చివరి రోజు 406 పరుగులు చేయాలి. ఉన్నది ముగ్గురు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్, వికెట్‌ కీపర్‌. వీరంతా మహా అంటే లంచ్‌ వరకు ఆడగలరేమో! ఎటు తిరిగీ భారత్‌కు భారీ తేడాతో పరాజయం ఖాయం. ఆ వెంటనే పరాభవ భారమూ తథ్యం! ... ఇంతటి తీవ్ర ఒత్తిడి మధ్య, ఏ మాత్రం ఆశలు లేని స్థితి నుంచి... ఓ దశలో విజయంపై ఆశలు చిగురించేలా చేసింది లోకేశ్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌ ద్వయం! అసాధారణ పోరాటంతో శతకాలు చేయడమే కాదు... అద్భుతం అనదగ్గ రీతిలో మ్యాచ్‌ను కోహ్లి సేన పరం చేసేలా కనిపించింది! అయితే, కొండంత లక్ష్యాన్ని చేరుకోవడంలో వారి శ్రమ కొద్ది దూరంలో ఆగిపోయింది. ఈ జంట విడిపోయిన మరు క్షణం నుంచే భారత్‌ ఓటమికి చేరువైంది. సిరీస్‌ 4–1తో ఇంగ్లండ్‌ ఖాతాలోకి చేరింది.   

లండన్‌: సుదీర్ఘ ఇంగ్లండ్‌ పర్యటనను టీమిండియా పరాజయంతో ముగించింది. అది కూడా కాస్త గౌరవప్రదంగా! కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో సోమవారమే ముగ్గురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయి... గెలుపు కాదు, ‘డ్రా’ కూడా అసాధ్యమనే పరిస్థితుల మధ్య మంగళవారం ఆట ఐదో రోజు బరిలో దిగిన మన జట్టు అద్వితీయంగా పోరాడింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (224 బంతుల్లో 149; 20 ఫోర్లు, 1 సిక్స్‌), వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (146 బంతుల్లో 114; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన, అద్భుత శతకాలతో ఓ సమయంలో అనూహ్య ఫలితమూ వచ్చేలా కనిపించింది. ఆరో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఈ జోడీ ఆశలు రేకెత్తించింది. కానీ, కీలక సమయంలో ఆదిల్‌ రషీద్‌ (2/63) చక్కటి బంతితో రాహుల్‌ను ఔట్‌ చేసి భారత్‌ ఆశ లకు తెరదించాడు. ఆ వెంటనే పంత్‌నూ పెవిలియన్‌ పంపి ఆతిథ్య జట్టు విజయానికి ఊపిరి పోశాడు. 17 పరుగుల తేడాతో చివరి నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్‌ 345 పరుగులకు ఆలౌటై 118 పరుగులతో ఓటమి మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌ బౌలర్లు అండర్సన్‌ (3/45), స్యామ్‌ కరన్‌ (2/23) రాణించారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టు మినహా అన్నింటిని గెల్చుకున్న ఇంగ్లండ్‌ 4–1తో సిరీస్‌ను దక్కించుకుంది. కెరీర్‌ చివరి టెస్టులో అర్ధశతకం, శతకం సాధించిన ఆ జట్టు ఓపెనర్‌ అలిస్టర్‌ కుక్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. విరాట్‌ కోహ్లి, స్యామ్‌ కరన్‌లకు సంయుక్తంగా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది.  

లంచ్‌కు ముందు రాహుల్‌... తర్వాత రిషభ్‌ 
ఓవర్‌నైట్‌ స్కోరు 58/3తో మంగళవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌ను... రహానే (106 బంతుల్లో 37; 5 ఫోర్లు) తోడుగా రాహుల్‌ నడిపించాడు. మొదటి ఓవర్‌ చివరి బంతిని బౌండరీకి పంపి అర్ధ శతకం (57 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో వైస్‌ కెప్టెన్‌ సహాయక పాత్ర పోషించాడు. తొలుత ఆచితూచి ఆడిన రాహుల్‌... ఇంగ్లండ్‌ ప్రధాన బౌలర్లు అండర్సన్, బ్రాడ్‌ చెరో నాలుగు ఓవర్లు వేసి తప్పుకోవడంతో జోరు పెంచాడు. రహానే కూడా బ్యాట్‌ ఝళిపించడంతో క్రమంగా పరుగులు రావడం మొదలైంది. అయితే, మూడో వికెట్‌కు 118 పరుగులు జోడించాక రహానే... మొయిన్‌ అలీ బౌలింగ్‌లో  జెన్నింగ్స్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు హనుమ విహారి (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్టోక్స్‌ వేసిన షార్ట్‌ పిచ్‌ బంతి హనుమ విహారి బ్యాట్‌ను తాకుతూ కీపర్‌ చేతుల్లో పడింది. దీంతో భారత్‌ 121/5తో నిలిచింది. ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఇంకెంతో సమయం పట్టదనిపించింది. కానీ, రాహుల్‌ పోయేదేమీ లేదన్నట్లు ఆడాడు. అలీ బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్, ఫోర్‌తో 118 బంతుల్లో శతకం అందుకున్నాడు.

కెరీర్‌లో అతడికిది ఐదో సెంచరీ. అప్పటికి జట్టు స్కోరు 152 కాగా... అందులో ఓపెనర్‌వే 101 ఉండటం గమనార్హం. లంచ్‌కు ముందు పంత్‌ సైతం అలీ బౌలింగ్‌లో భారీ సిక్స్‌ కొట్టాడు. 167/5తో భారత్‌ విరామానికి వెళ్లింది. లంచ్‌ తర్వాత రాహుల్‌ నెమ్మదించగా, రిషభ్‌ చెలరేగాడు. 78 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. స్టోక్స్‌ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. సుదీర్ఘ సమయం తర్వాత అండర్సన్, బ్రాడ్‌ బౌలింగ్‌కు వచ్చినా వీరిని ఇబ్బంది పెట్టలేకపోయారు. రషీద్‌ బౌలింగ్‌లో సిక్స్‌తో 90ల్లోకి వచ్చిన పంత్‌... అతడి ఓవర్లోనే మరో సిక్స్‌తో ఘనంగా కెరీర్‌ తొలి శతకం అందుకున్నాడు. లంచ్‌–టీ మధ్య భారత్‌ వికెట్‌ కోల్పోకుండా 131 పరుగులు చేయడం గమనార్హం. విరామం అనంతరం ఏడో ఓవర్లోనే రషీద్‌ దెబ్బకొట్టాడు. రౌండ్‌ ద వికెట్‌ వచ్చి అతడు వేసిన బంతి అనూహ్యంగా స్పిన్‌ అయి రాహుల్‌ వికెట్లను గిరాటేసింది. దీంతో ఆరో వికెట్‌కు 204 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. తన మరుసటి ఓవర్లో... పంత్‌ భారీ షాట్‌కు యత్నించి లాంగాఫ్‌లో అలీకి క్యాచ్‌ ఇచ్చాడు. కాసేపు పోరాడిన జడేజా (13), ఇషాంత్‌ (5)లను కరన్‌ ఔట్‌ చేశాడు. షమీ (0)ని అండర్సన్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లండ్‌ సంబరాల్లో మునిగిపోయింది. గెలుపు దక్కకున్నా... ఓటమి పరుగుల అంతరాన్ని తగ్గించడంలో రాహుల్‌–పంత్‌ ద్వయం విజయవంతమైంది.  

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేస్‌ బౌలర్‌గా, నాలుగో బౌలర్‌గా అండర్సన్‌ (564) గుర్తింపు పొందాడు. మెక్‌గ్రాత్‌  (ఆస్ట్రేలియా–563) పేరిట ఉన్న రికార్డును అతను అధిగమించాడు. మురళీధరన్‌ (శ్రీలంక–800), షేన్‌ వార్న్‌ (ఆస్ట్రేలియా–708), అనిల్‌ కుంబ్లే (భారత్‌–619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. 

►తమ కెరీర్‌ చివరి టెస్టులో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న ఎనిమిదో క్రికెటర్‌ అలిస్టర్‌ కుక్‌. గతంలో ఇయాన్‌ రెడ్‌పాత్, గ్రెగ్‌ చాపెల్, జాసన్‌ గిలెస్పీ (ఆస్ట్రేలియా), సునీల్‌ గావస్కర్‌ (భారత్‌), ముర్రే

►గుడ్విన్‌ (జింబాబ్వే), షేన్‌ బాండ్‌ (న్యూజిలాండ్‌), సర్ఫరాజ్‌ నవాజ్‌ (పాకిస్తాన్‌) ఈ ఘనత సాధించారు.  

►సిక్స్‌ ద్వారా తమ తొలి టెస్టు సెంచరీని పూర్తి చేసుకున్న నాలుగో భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌. గతంలో కపిల్‌ దేవ్, ఇర్ఫాన్‌ పఠాన్, హర్భజన్‌ సింగ్‌ ఇలా చేశారు.  

►టెస్టులోని 4వ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌.  

►ఓ సిరీస్‌లో భారత జట్టు నాలుగు టెస్టుల్లో ఓడిపోవడం ఇది ఎనిమిదోసారి.  

విజయంతో వీడ్కోలు బాగుంది... 
ఈ వారం అద్భుతంగా గడిచింది. ఈ టెస్టు ఇంగ్లండ్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించినందుకు, మా జట్టు 4–1తో సిరీస్‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప విజయంతో నిష్క్రమిస్తున్నా. ఈ మ్యాచ్‌ చివరి సెషన్‌దాకా సాగడం సంప్రదాయ క్రికెట్‌ గొప్పతనాన్ని చాటింది. నా కెరీర్‌లో గొప్ప విశేషాలున్నాయి. చేదు ఫలితాలూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెస్టు క్రికెట్‌ ఎంత క్లిష్టమో చెప్పాయి. బ్రాడ్‌తో నాది సుదీర్ఘ అనుబంధం. ఇద్దరం 12 ఏళ్లు జట్టుకు ఆడాం. నా రిటైర్మెంట్‌తో ఇకపై అతని బౌలింగ్‌లో నేను స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేయడం కుదరదు. క్యాచ్‌లు వదలడం జరగదు.
– మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కుక్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement