అన్నీ నిజాలే చెప్పా
ముంబై: ఆటోబయోగ్రఫీ ద్వారా సచిన్ టెండూల్కర్ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌తో పాటు తనకు ఎదురైన అనుభవాలు, వివాదాలు తదితర అంశాలను పుస్తకంలో వెల్లడించాడు. ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ విడుదల సందర్భంగా ఇందులోని వేర్వేరు అంశాలపై తన అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నాడు. అందులోని ప్రధానాంశాలు అతని మాటల్లోనే...
అప్పుడు అంజలి ఉంది: చాపెల్‌కు, నాకు మధ్య సంభాషణ జరిగినప్పుడు అంజలి అక్కడే ఉంది. ఇదొక్కటి చాలు నేను నిజం చెప్పాననడానికి. కెప్టెన్సీ గురించి నాకూ, చాపెల్‌కు మధ్య జరిగిన సంభాషణ గురించి నేను కావాలనే ద్రవిడ్‌కు చెప్పలేదు. నేను ఆ ఆఫర్‌ను తిరస్కరించగానే విషయం అంతటితో ముగిసిపోయింది. చాపెల్ కోచ్‌గా పని చేసిన తొలి రెండు సిరీస్‌లు నేను జట్టులో లేను. ఆ తర్వాత టీమ్ సభ్యులు కొందరు ఆయనతో పని చేయడం చాలా కష్టంగా ఉందని చెబితే... తొందరపడవద్దు, కొత్త కోచ్ అలవాటు పడేందుకు మనం కాస్త సమయం ఇవ్వాలని మందలించాను. కానీ ఆ తర్వాత ఆటగాళ్లు చెప్పిందే నిజమైంది.
పర్యటన బహిష్కరిద్దామనుకున్నా: 2007-08 సిడ్నీ టెస్టులో ‘మంకీ గేట్’ ఉదంతం అనూహ్యం. ఆ మ్యాచ్‌లో చాలా సేపు సైమండ్స్, హర్భజన్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. చివరకు భజ్జీలో ఓపిక నశించింది. అతను తేరీ మా కీ...అనే అన్నాడు. ఇది ఆగ్రహం వ్యక్తం చేసేందుకు మనం భారత్‌లో తరచుగా వాడుతూనే ఉంటాం. దానిని ‘మంకీ’గా భావించి ఆస్ట్రేలియా జట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించింది.
ఆ మ్యాచ్‌లో చాలా మంది ఆసీస్ ఆటగాళ్ల ప్రవర్తన కూడా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. మా వాదన వినకుండా ఆసీస్‌కు అనుకూలంగా విచారణ సాగింది. మమ్మల్మి అబద్ధాలకోరుగా రిఫరీ ప్రాక్టర్ భావించడం నాకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. హర్భజన్‌పై నిషేధం తొలగించకపోతే పర్యటన రద్దు చేసుకుందామని నేను, కెప్టెన్ కుంబ్లే కలిసి నిర్ణయించుకున్నాం. ఈ ఘటన తర్వాత పెర్త్ టెస్టు గెలవడం నిజంగా గొప్ప జ్ఞాపకం. బాటిల్స్ కొద్ది షాంపేన్‌తో సంబరాలు చేసుకున్నాం. గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ మా డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చి అభినందించడం మరచిపోలేనిది.
మైదానం బయటా అదే ఒత్తిడి: జట్టు కెప్టెన్సీ వ్యక్తిగా కూడా నాపై ఒత్తిడి పెంచింది. ఎప్పుడు ఓటమి ఎదురైనా చాలా బాధ కలిగేది. నేను కుటుంబంతో ఉన్న సమయంలో కూడా దాని ఆలోచనలే వచ్చేవి. ఇవన్నీ నాపై ప్రభావం చూపించాయి. కెప్టెన్‌గా నా వైఫల్యానికి ఎవరినీ నిందించను. నాడు భారీ స్కోర్లు చేయగల బ్యాట్స్‌మెన్, 20 వికెట్లు తీయగల బౌలర్లు మనకు లేరని మీకర్థమవుతుంది.
సమయం కోసం ఎదురు చూశా: కెరీర్‌కు ఒకే ఒక్క రిటైర్మెంట్ ఉండాలి. అది ఎప్పటికీ నా ఆఖరి మ్యాచ్ కావాలి అనేది నా నమ్మకం. ఇప్పుడు రిటైర్ అవుతాడా, తర్వాత అవుతాడా అనే సందేహాలు జనంలో ఉండరాదు. నాకు దానిపై స్పష్టత ఉంది కాబట్టే అదృష్టవశాత్తూ అనుకున్న విధంగా తప్పుకోగలిగాను. ప్రపంచ కప్ గెలవగానే రిటైర్మెంట్ గురించి ఆలోచించలేదు.
ఎందుకంటే నేను 21 ఏళ్ల పాటు ఎదురు చూసిన ఆ క్షణాలు ఆస్వాదిస్తున్నాను. నన్ను నేను అద్దంలో చూసుకోవాలంటూ ఇయాన్ చాపెల్‌లాంటి వ్యక్తుల విమర్శలు పట్టించుకోలేదు. ఆయన నాకన్నా ఎన్నో ఎక్కువ సార్లు విఫలమయ్యాడు. వీబీ సిరీస్‌లో సెంచరీ సాధించి నా బ్యాట్‌తోనే సమాధానమిచ్చా. తర్వాత ఈ విషయంపై చాపెల్‌ను కడిగేశాను కూడా.
టాంపరింగ్ వివాదంతో పాఠం నేర్చుకున్నా: దక్షిణాఫ్రికాలో బాల్ టాంపరింగ్ వివాదం కూడా నాకు సంబంధం లేనిది. నేను టాంపరింగ్ చేశానని కొందరు చెప్పగానే షాక్‌కు గురయ్యా. అప్పుడు బంతి సీమ్‌పై మట్టి తొలగిస్తున్నాను. అదే విషయాన్ని అంపైర్లతో చెబుతూ బంతిలో ఏమైనా మార్పు వచ్చిందా అని అడిగితే లేదన్నారు. విచారణ సందర్భంగా రిఫరీకి కూడా అదే స్పష్టం చేశాను. ఇకపై ఇలాంటిది ఉంటే అంపైర్లకు చెప్పాలని ఆయన హెచ్చరించారు. అంతే...ఆ తర్వాత భవిష్యత్తులో ఏ టెస్టులోనైనా నేను సీమ్ శుభ్రం చేస్తే అంపైర్లకు చెప్పడం, వారు నవ్వడం రొటీన్‌గా మారిపోయింది. వివాదంతో నేను నేర్చుకున్న పాఠమిదే.
నేనూ రాతగాడినే...
నా కుటుంబంలో నాన్నతో పాటు సోదరులంతా మంచి రచయితలే. అందుకే నేను కూడా బాగానే రాశానేమో. నా జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నాకు తెలిసింది అందరితో పంచుకున్నాను. ప్రతీది చెప్పలేకపోయిన నాకు నచ్చిన విధంగా పుస్తకం రాశాను. పరుగులు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పుడు పుస్తకం రాయలేం. అందుకే రిటైర్మెంట్ తర్వాత ఆ పని చేశా. అన్నీ నిజాలే రాశాను. సరదా ఘటనలు, వివాదాలు, నా వ్యక్తిగత జీవితంలో వీలైనన్ని ఎక్కువ అంశాలు కవర్ చేశాను.
గత మూడేళ్లుగా దీనిపై పని చేశాను. ముఖ్యంగా నాకు, అంజలికి మధ్య ఉన్న అనుబంధం గురించి రాయడానికే కాస్త ఎక్కువ శ్రమించాను. ఎందుకంటే అందులో చాలా విషయాలు బయటి ప్రపంచానికి తెలియనివి. భారత జట్టుకు దూరమయ్యాననే బాధ లేదు. ఎంసీసీ మ్యాచ్ ఆడాక నా శరీరాన్ని చూస్తే సరైన నిర్ణయం తీసుకున్నాననిపించింది. జట్టు సభ్యులందరిని సోదరులుగానే భావించాను.
ఫిక్సింగ్ గురించి తెలీదు: నాకు 100 శాతం తెలిసినవాటినే నేను పుస్తకంలో రాశాను. ఎందుకంటే రేపు నేను వాటిని సమర్థించుకోగలను. కానీ నాకు పూర్తిగా తెలియని అంశాలపై వ్యాఖ్య చేయలేను. కాబట్టి వాటి గురించి మాట్లాడటం సరైంది కాదు. ఒక సాక్ష్యం లాంటిది నా వద్ద ఉంటే వివరంగా మాట్లాడటంలో అర్థముంది.
దానిని జనం కూడా ఆమోదిస్తారు. అందుకే ఫిక్సింగ్ అంశంపై ఏమీ చెప్పలేదు. కొంత మంది క్రికెటర్లు కావాలని బాగా ఆడకపోవడం అనేదానిని నేను నమ్మను. మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన కావాలనే అలా చేశాడని వేలెత్తి చూపడం సరైంది కాదు. 24 ఏళ్ల పాటు ఆడాను.
ఆటలోనూ, జీవితంలోనూ ప్రతీ ఒక్కరికి వైఫల్యాలు సహజం. కీలక విషయాలపై నేను స్పందించలేదనే విమర్శ ఉంది. నా పుస్తకంలో వాటన్నింటికీ సమాధానం ఉంది. నాకు కచ్చితంగా తెలిసిన అన్ని విషయాల గురించి మనసు విప్పి మాట్లాడాను. ఎవరినుంచో విన్నవి, బయటి వ్యక్తులు చెప్పినవాటి ఆధారంగా వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు.