ఆత్మకథలు అనేక రకాలు. కొన్ని కేవలం సంచలనం కోసం రాసేవి. మరికొన్ని భవిష్యత్తరాల్లో కూడా స్ఫూర్తినీ, దీప్తినీ నింపేవి. క్రీడాకారుల ఆత్మకథలు మనకు కొత్తేం కాదు. కపిల్, గవాస్కర్, గోపీచంద్... ఇలా అనేకమంది క్రీడాకారుల ఆత్మకథలు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్నాయి. అయితే క్రికెట్ క్రీడాభిమానుల ఆరాథ్యదైవం సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ కోసం మాత్రం ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. గతంలో సచిన్‌పై అనేక పుస్తకాలు వచ్చాయి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్‌లో ఆయన తనకు తానై మీడియాకు ఎన్నో విషయాలు చెప్పాడు. ఇంకా సచిన్ గురించి అభిమానులకు తెలియనిదేమైనా ఉంటుందా? అయినా ఆయన ఆత్మకథపై అంత ఆసక్తి ఎందుకంటే... క్రికెట్ దేవుడి జీవితంలో మనకు తెలియని సంఘటనలు ఉన్నాయేమో తెలుసుకోవాలనే!
పుస్తకాన్ని వివాదాస్పద అంశాలతో నింపడం...విడుదలకు ముందు వాటిని బయటపెట్టడం ఈమధ్యకాలంలో తరచుగా కనిపిస్తున్న మార్కెటింగ్ వ్యూహం. సచిన్ కూడా ఆ పనే చేశాడా? గ్రెగ్ చాపెల్ నిరంకుశత్వం గురించి పుస్తకం విడుదలకు ముందే వెల్లడించడం అందులో భాగమా? 24 ఏళ్ల కెరీర్‌లో ఏనాడూ వివాదాల జోలికి పోని మాస్టర్... తన పుస్తకం ప్రచారం కోసం ఓ కోచ్‌పై వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదు. సచిన్ పుస్తకం అనేక అంశాలను స్పృశించింది. ఆస్ట్రేలియాలో మంకీగేట్ వివాదం, దక్షిణాఫ్రికాలో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు, ప్రపంచకప్‌లో విజయాలు, ఘోర పరాజయాలు... ఇలా అన్ని విషయాలపైనా ఏదో ఒక సమయంలో మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాడు. అయితే మనసు లోపల దాచుకున్న, వివాదాలను దరి చేరనీయకూడదని భావించిన అంశాలను మాత్రం పుస్తకంలో ప్రస్తావించాడు. ముల్తాన్ టెస్టులో తాను డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో కెప్టెన్ డిక్లేర్ చేయడం గురించి తొలిసారి మనసులో మాట బయటపెట్టాడు. ఆ రోజు తాను బాధపడ్డాడనే విషయం ఇప్పుడు చెప్పాడు. అలాగే కపిల్‌దేవ్ కోచ్‌గా పనికిరాలేదని చెప్పడానికి చాలా తెగువ ఉండాలి. సచిన్ ఆ తెగువనూ చూపాడు. నిజాల్ని నిర్భయంగా చెబితేనే అది నిజమైన ఆత్మకథ అవుతుంది.
మ్యాచ్ ఫిక్సింగ్ గురించి సచిన్ ఏం చెబుతాడో అని కూడా క్రికెట్ వర్గాలు ఎదురుచూశాయి. కానీ దీని గురించి సచిన్ పెద్దగా స్పందించలేదు. బాధ్యతగల ఓ క్రికెటర్ 24 ఏళ్ల కెరీర్‌లో ఒక్క సంఘటన కూడా ఎదుర్కోలేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. పుస్తకంలో దీనికి జవాబుంది. ‘నేను నేరుగా చూసిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను మట్లాడతా. వేరే వాళ్లు చెప్పిన మాటల ఆధారంగా ఓ అభిప్రాయాన్ని ఎప్పుడూ ఏర్పరుచుకోను’ అని రాశాడు.
ఈ పుస్తకంలో వివాదాల గురించి మాత్రమే చర్చ జరుగుతోందిగానీ... ఓ కుర్రాడు ముంబై వీధుల్లో చేసిన అల్లరి, ఆట కోసం పడ్డ కష్టం, ఓ తండ్రి ప్రోత్సాహం, ఓ అన్న మార్గనిర్దేశనం, ఓ గురువు క్రమశిక్షణ.. ఇలా అనేక అంశాలు పుస్తకంలో ఉన్నాయి. ఓ మధ్యతరగతి కుర్రాడు... ప్రపంచం ఆరాధించే వ్యక్తిగా మారడం వెనక దాగి ఉన్న కృషి, పట్టుదల ఉన్నాయి.
ఒక వ్యక్తి వరుసగా రెండు రోజులపాటు జరిగిన రెండు శస్త్రచికిత్సల తర్వాత నెల రోజుల్లోనే కోలుకుని బ్యాట్ పట్టుకోవాలంటే ఎంత ఫిట్‌నెస్ ఉండాలో అంతకు మించిన మానసిక దృఢత్వం ఉండాలి. తండ్రి చనిపోయిన బాధను గుండెల్లో దాచుకుని కోట్లాది మందిని తన బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించడానికి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇవన్నీ రాత్రికి రాత్రే సచిన్‌కు రాలేదు. వీటన్నిటి గురించి మాస్టర్ ఈ పుస్తకంలో రాశాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఆటే జీవితంగా బతికిన వ్యక్తి... 41 ఏళ్ల వయసులో పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని చెప్పడం చాలా కష్టం. అందులోనూ ఏడాదిలో 300 రోజుల పాటు ప్రపంచాన్ని చుట్టే వ్యక్తికి ఇది చాలా కష్టం. అందుకే ఈ పుస్తకం కోసం మాస్టర్ మూడు సంవత్సరాలు తీసు కున్నాడు. తొలిసారి సైకిల్ ఎక్కినప్పుడు సచిన్ కిందపడి దెబ్బ తగిలించుకు న్నాడు. కానీ నెల రోజుల్లోనే తమ కాలనీలో అందరికంటే వేగంగా సైకిల్ తొక్కే కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు. తనలోని పట్టుదల, పోరాటతత్వం పెరగడానికి చిన్నప్పుడు జరిగిన ఇలాంటి సంఘటనలే కారణం అని సచిన్ చెప్పాడు.
మరి కెప్టెన్‌గా సచిన్ వైఫల్యానికి కారణాలేమిటి? ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న వ్యక్తి తన జట్టుకు అత్యుత్తమ నాయకుడు ఎందుకు కాలేకపోయాడు? ఆత్మకథలో ఇలాంటి ప్రశ్నలకూ జవాబుంది.ఎంచుకున్న వృత్తిలో అత్యున్నత శిఖరాలకు చేరాలంటే ప్రతి రోజూ నిత్య విద్యార్థిగా ఉండాలని ఆయన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. తన కెరీర్ చివరి రోజుల్లో కూడా కొత్తగా వచ్చిన యువ ఆటగాళ్ల దగ్గర షాట్స్ నేర్చుకోవడం సచిన్ ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఓ వ్యక్తి ఎదిగిన తర్వాత కూడా ఎంత హుందాగా మెలగాలో, దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఎంత బాధ్యతగా వ్యవహరించాలో ఈ పుస్తకం నేర్పుతుంది. విజయాలను మహాద్భుతమని పొగిడినా...వైఫల్యాలపై కటువుగా విమర్శించినా మాస్టర్ స్థితప్రజ్ఞతను ప్రదర్శించాడు. విజయాలను ఆస్వాదిం చినట్టే, వైఫల్యాలనుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దేశంలో క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచిన మాస్టర్... ఆ క్రమంలో తాను కోల్పోయిన వ్యక్తిగత జీవితం చాలా ఉంది. ఈ రోజు భారతరత్న స్థాయికి మాస్టర్ చేరడానికి తన కుటుంబం చేసిన త్యాగాలు, పడ్డ కష్టం ప్రతి వ్యక్తికీ స్ఫూర్తినిచ్చేవే. అందువల్లే ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ యువతలో స్ఫూర్తిని పెంచే గ్రంథం. ఈ తరం క్రికెటర్లకూ... ఆ మాటకొస్తే ఏ రంగంలో పనిచేసేవారికైనా సచిన్ ఆత్మకథ ఓ పాఠ్యగ్రంథంలాంటిది.
ఆత్మకథ కాదు...పాఠ్యగ్రంథం
Published Fri, Nov 7 2014 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement