ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా!
తొలి అంతర్జాతీయ సిరీస్‌ను గుర్తు చేసుకున్న సచిన్
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ ద్వారా... అతని కెరీర్‌లో, జీవితంలో జరిగిన అనేక సంఘటనలు అభిమానులకు తెలుస్తున్నాయి. వాటిలో బాగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా 16 ఏళ్ల వయసులో సచిన్ తొలిసారి పాకిస్థాన్ వెళ్లి అంతర్జాతీయ క్రికెట్ ఆడినప్పటి అనుభవాలు మరీ ఆసక్తికరం.
ఆ విశేషాలు మాస్టర్ మాటల్లోనే...
1989లో పాకిస్థాన్‌లో నా తొలి అంతర్జాతీయ పర్యటనకు గొప్ప బౌలర్లందరినీ ఒకేసారి ఎదుర్కొన్నాను. అక్రమ్ బౌలింగ్‌లో తొలిసారి ఆడాను. వరుసగా నాలుగు బౌన్సర్లు వేశాడు. నాకు నేనే ‘టెస్టు క్రికెట్‌కు స్వాగతం’ అని చెప్పుకున్నాను. ఇమ్రాన్, అక్రమ్, వకార్, ఆకిబ్, ముస్తాక్ అహ్మద్, అబ్దుల్ ఖాదిర్... ఇంత గొప్ప బౌలర్లను ఆ సిరీస్‌లో ఆడాను. ఆ సిరీస్‌లో నాలుగో టెస్టులో తొలిసారి భయపడ్డాను. వకార్ వేసిన బంతి వచ్చే ఎత్తు విషయంలో పొరబడ్డాను. దీంతో బంతి నా ముక్కుకు తగిలింది.
కళ్లు మసకబారాయి. తల బరువుగా అనిపించింది. బంతి ఎటు వెళ్లిందో చూస్తున్నాను. ఈలోగా చొక్కా మీద రక్తం కనిపించింది. ఈ లోగా మియందాద్ దగ్గరకు వచ్చాడు. ‘అరే... నీ ముక్కు పగిలిపోయింది. నువ్వు హాస్పటల్‌కి వెళ్లాలిగా’ అని వెక్కిరించాడు. ఇది చాలదన్నట్లు స్టాండ్స్‌లో ఒక అభిమాని బ్యానర్ తీశాడు. ‘పిల్లాడా... ఇంటికెళ్లి పాలు తాగిరామ్మా’ అని రాశాడు. దీంతో చాలా అసహనంగా అనిపించింది.
చాలా భయపడ్డాను
అలాగే భారత్-పాక్ సిరీస్ ఎంత ఉద్రిక్తంగా ఉంటుందో కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో నా తొలి రోజే తెలిసింది. లంచ్ తర్వాత సెషన్‌లో ఒక వ్యక్తి మైదానంలోకి వచ్చాడు. సల్వార్ కమీజ్ వేసుకుని బాగా గడ్డం పెంచుకుని ఉన్నాడు. నేరుగా కపిల్ దగ్గరకు వెళ్లి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ప్రభాకర్‌నీ తిట్టాడు.
ఆ వెంటనే కెప్టెన్ శ్రీకాంత్ దగ్గరకి దూసుకెళ్లి కొట్టడం మొదలుపెట్టాడు. ఆ పక్కనే నేను ఉన్నా. చాలా భయపడ్డా. ఇక తర్వాత నా వంతే అనిపించింది. ఒకవేళ నా వైపు వస్తుంటే డ్రెస్సింగ్‌రూమ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అసలు అది క్రికెట్ మ్యాచ్‌లా అనిపించలేదు.