సచిన్ 'ఆత్మ' చుట్టూ వివాద భూతం
ప్రముఖుల ఆత్మకథలు వెలుగు చూస్తున్నాయంటే చాలూ.. వివాదాల భూతాలు సిద్ధంగా ఉంటాయనేది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథతో మరోసారి స్పష్టమైంది. గతంలో సంజయ్‌బారు రచించిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్, అన్‌మేకింగ్', పీసీ పరేఖ్ 'క్రూసేడర్ అండ్ కాన్‌స్పిరేటర్', ఎల్కె అద్వానీ 'మై కంట్రీ.. మై లైఫ్'. నట్వర్ సింగ్ 'వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్'లు విడుదలకు ముందే సంచలనానికి తెర తీసిన సంగతి తెలిసిందే. అయితే సచిన్ కూడా తన ఆత్మకథను పబ్లిసిటీకి వాడుకున్నారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజాగా ‘ప్లేయింగ్ ఇట్ మై వే' అంటూ క్రికెట్ దేవుడు సచిన్ తన అనుభవాలను రంగరించి ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోవాలనుకున్నారు. వ్యక్తిగత జీవితంలో పలు కీలక అంశాలతోపాటు, క్రీడా రంగంలోని కొన్ని ఉదంతాలును కూడా ఉదహరించారు. అయితే గతంలో భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన గ్రెగ్ చాపెల్ వ్యవహార శైలిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం సంచలనానికి తెర తీసింది. ద్రావిడ్, లక్ష్మణ్ లను జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన తన దృష్టికి తీసుకు వచ్చారని చాపెల్ పై సచిన్ దుమ్మెత్తి పోశారు. తన అభిప్రాయాల్ని ఛాపెల్ బలవంతంగా ఆటగాళ్లపై రుద్దేవాడని సచిన్ ఆత్మకథ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ లో వెల్లడించడం పతాక శీర్షికల్ని ఆకర్షించాయి.
క్రికెట్ రంగానికి సేవ చేసినంత కాలంలో వివాదాలను బౌండరీ బయటనే ఉంచిన సచిన్ ఒక్కసారిగా ఆత్మకథ ద్వారా వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. సచిన్ వ్యాఖ్యలపై చాపెల్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. సచిన్ చెప్పేవన్నీ అబద్దాలంటూ చాపెల్ ఎదురు దాడికి దిగారు. దాంతో భారత క్రికెటర్లు సచిన్ కు బాసటగా నిలిచి.. చాపెల్ పై ముప్పేట దాడి చేశారు.
భారత జట్టులో చాపెల్ తీసుకున్న వివాదస్పద నిర్ణయాలపై సచిన్ అప్పుడే ఎందుకు స్పందించలేదనే కోణంలో విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత క్రికెటర్లు ఒక్కతాటిపైకి వచ్చిన విధంగా జట్టు ప్రయోజనాల్ని రక్షించడానికి అప్పుడే ఎందుకు చాపెల్ పై తిరుగుబాటు ఎందుకు చేయలేదని వాదన కూడా వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత జట్టు ప్రతిష్టపై మచ్చ పడకుండా సచిన్, ఇతర క్రికెటర్లు సహనం పాటించారనే వాదన అంతే మొత్తంలో వినిపిస్తోంది. ఏదిఏమైనా ఆత్మకథలకు వివాద భూతాలకు అవినాభావ సంబంధం ఉందని మరోసారి సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' రుజువు చేసింది. క్రికెట్ ఆటకు దూరమైన తర్వాత కోట్లాది మంది అభిమానులకు చేరువకావాలనే లక్ష్యంతో సచిన్ రాసిన ఆత్మకథ అందర్ని ఆకట్టుకుంటుందని ఆశిద్దాం!