సచిన్ ఆత్మకథ మరో 'రికార్డు'!
న్యూఢిల్లీ:ఇప్పటికే పుస్తక ప్రపంచంలో అనేక రికార్డునులను కొల్లగొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథ 'ప్లేయింగ్ ఇట్ మై వే' మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో 'ప్లేయింగ్ ఇట్ మై వే' కు స్థానం దక్కింది. ఈ పుస్తకం అమ్మకాల్లో టాప్ లో నిలవడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కింది. అటు ఫిక్షన్, ఇటు నాన్ ఫిక్షన్ కేటగిరీలలో ప్లేయింగ్ ఇట్ మై వే తనదైన ముద్రను వేసింది. ఇదిలా ఉండగా, రూ.899 కవర్ పేజీ ధర కల్గిన సచిన్ ఆత్మకథ ఇప్పటివరకూ రిటైల్గా రూ. 13.51 కోట్లను వసూలు చేయడం మరో విశేషం.
నవంబర్ 6, 2014వ సంవత్సరంలో సచిన్ ఆత్మకథ విడుదలైన సంగతి తెలిసిందే. సచిన్ ఆత్మకథను హచిటే ఇండియా సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం విడుదలకు ముందే 1,50,289 కాపీల మేర ఆర్డర్లను దక్కించుకుని పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ క్రమంలోనే ‘యాపిల్’ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవితచరిత్ర రికార్డును వెనక్కునెట్టడంతో పాటు, డాన్ బ్రౌన్ ఇన్ ఫెర్నీనో, జేకే రోలింగ్ క్యాజువల్ వెకెన్సీ తదితర పుస్తకాల రికార్డును సచిన్ ఆత్మకథ అధిగమించింది.