పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్
న్యూఢిల్లీ: ఈడెన్ గార్డెన్స్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న మాజీ టెస్టు క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఆ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అయితే ఈసారి ఆటగాడిగా కాకుండా వక్తగా తన ప్రావీణ్యాన్ని చూపనున్నాడు. ఈనెల 19న ఈడెన్‌లో జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో లక్ష్మణ్ ప్రసంగించనున్నాడు.
భారత్, విండీస్ జట్ల మధ్య జరిగే చివరిదైన ఐదో వన్డేతోపాటు బెంగాల్ క్రికెట్ సంఘం 150 ఏళ్ల పండుగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ‘పటౌడీ పరిజ్ఞానంపై నేనెప్పుడూ ఆకర్షితుడినయ్యే వాడిని. ఆయనకు నేను పెద్ద అభిమానిని. ఎం.ఎల్. జైసింహా ద్వారా ఆయన గురించి తెలుసుకునేవాడిని. నాలాగే పటౌడీ కూడా హైదరాబాద్‌కు ఆడారు. ఆయన స్మారకోపన్యాసంలో మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను’ అని లక్ష్మణ్ తెలిపాడు. అలాగే ప్రారంభ ఉపన్యాసంలో గవాస్కర్.. చివరి ఎడిషన్‌లో కుంబ్లే మాట్లాడతారు.