సాక్షి, అమరావతి : స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయి బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబు బెయిల్ షరతులను యథేచ్ఛగా ఉల్లంఘించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు వెళ్లి అక్కడ తన అరెస్టు, జైలు గురించి ప్రసంగించి కోర్టు ఆదేశాలను ధిక్కరించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తన అరెస్టు గురించి మాట్లాడి కోర్టులంటే తనకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు అక్టోబర్ 31న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసు గురించి ఎక్కడా ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మాట్లాడకూడదని హైకోర్టు బెయిల్ ఆర్డర్‌లో స్పష్టంగా పేర్కొంది. కేసులోని విషయాల గురించి బయట ఎక్కడా చర్చించవద్దని స్పష్టంచేసింది. అలాగే, హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తప్పకుండా పాటించాలని, స్కిల్ డెవలప్‌మెంట్ కేసు గురించి ఎక్కడా మాట్లాడకూడదని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. అయితే, చంద్రబాబు మాత్రం వీటిని బహిరంగంగా ఉల్లంఘించారు.
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం అత్తోటలో శుక్రవారం తుపాను బాధితులను పరామర్శించి అక్కడ రాజకీయ ప్రసంగం చేశారు. తుపాను దెబ్బకు అన్ని విధాలుగా నష్టపోయి రైతులు ఆందోళనలో ఉంటే చంద్రబాబు మాత్రం అక్కడకు వెళ్లి తనను అన్యాయంగా అరెస్టు చేశారని, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టారంటూ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసు గురించి మాట్లాడారు. ఇలా బెయిల్ షరతులను చంద్రబాబు బేఖాతరు చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్‌ను రద్దుచేయాలని కోరవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
45 ఏళ్లుగా టెక్నికల్‌గా, లీగల్‌గా తప్పుచేయలేదు..
తనలాంటి వాళ్లను కూడా జైల్లో పెట్టేయగలుగుతున్నారని, బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 45 ఏళ్లుగా తానెక్కడా ఒక్క తప్పు కూడా చేయలేదని, టెక్నికల్‌గా, లీగల్‌గా ఒక్క తప్పూ చేయకుండా ఉన్నానని, అలాంటి తనను జైల్లో పెట్టారని చెప్పారు. ఎలాంటి తప్పు కూడా చేయకుండా ఉన్న పళంగా కేసు బుక్‌చేసి లోపలేశాడని సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
కూడా మనిషినేనని, తనకూ బాధలు ఉంటాయని, తనకూ మనసు ఉంటుందని, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తే ఎలా ఉంటుందంటూ ప్రజల సానుభూతి కోసం ఆయన ప్రయత్నించారు. తన కోసం 52 రోజులుగా అందరూ వీరోచితంగా పోరాడారని, తనను అరెస్టుచేస్తే అందరినీ బెదిరించవచ్చనే ఉద్దేశంతో సీఎం ఇలా చేసినట్లు చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
న్యాయకోవిదుల విస్మయం..
బెయిల్ షరతులను ఉల్లంఘించి తాను అరెస్టయిన కేసు గురించి చంద్రబాబు మాట్లాడడంపై న్యాయకోవిదులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. బెయిల్ పొందినప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి బయటకు వచ్చాక ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో అందుకు సంబంధించిన విషయాల గురించి కాకుండా తాను జైలుపాలవడం, కేసుల గురించి మాట్లాడడం ఏమిటనే ప్రశ్నలు సాధారణ ప్రజానీకం నుంచి వినిపిస్తున్నాయి.
ఇక అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు కూడా రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు గంటల తరబడి ర్యాలీ చేసుకుంటూ వచ్చి ఆయన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. తనకు అరోగ్యం బాగోలేదని బెయిల్ తీసుకుని భారీఎత్తున ర్యాలీలు చేయడంపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసులోనే ఆయనకు రిమాండ్ విధించినప్పుడు సైతం న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా కామెంట్లు చేశారు.
సోషల్ మీడియాలో న్యాయమూర్తిని అసభ్యపదజాలంతో ధూషిస్తూ పోస్టులు పెట్టారు. చంద్రబాబు జైల్లో ఉన్నన్ని రోజులు ఆయన కుమారుడు లోకేశ్, ఇతర నాయకులు కోర్టులను మేనేజ్ చేశారంటూ న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడారు. చివరికి అదే న్యాయ వ్యవస్థ నుంచి చంద్రబాబు బెయిల్ పొంది బయటకొచ్చారు. ఇప్పుడు ఆ కోర్టు ఆదేశాలనే ధిక్కరిస్తూ స్కిల్ కుంభకోణం గురించి రాజకీయ ఉపన్యాసం చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment