
పట్టు బిగించిన ఆసీస్
కేప్‌టౌన్: నిర్ణయాత్మక మూడో టెస్టులో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 494/7 వద్దే తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియా... మూడో రోజు సోమవారం... దక్షిణాఫ్రికాను 287 పరుగులకే ఆలౌట్ చేసింది.
అల్విరో పీటర్సన్ (53), డుప్లెసిస్ (67) అర్ధసెంచరీలు చేసినా... మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో... సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 207 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్నారు. ఆసీస్ పేసర్లలో మిచెల్ జాన్సన్ (4/42), హారిస్ (3/63) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్యాటిన్సన్ రెండు, వాట్సన్ ఒక వికెట్ పడగొట్టారు.
ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నా... ఆసీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి... వికెట్ నష్టపోకుండా 27 పరుగులు చేసింది. వార్నర్ (25 బ్యాటింగ్), రోజర్స్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఆసీస్ ప్రస్తుతం 234 పరుగుల ఆధిక్యంలో ఉంది.