అవకాశాలను అందిపుచ్చుకోండి
ఆక్లాండ్: టెస్టు సిరీస్‌లో కీలక సమయంలో వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భారత కెప్టెన్ ఎం.ఎస్.ధోని... తన సహచరులకు సూచించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించడం ఇక్కడ దోహదపడుతుందన్నాడు. నేటి నుంచి న్యూజిలాండ్‌తో తొలి టెస్టు జరగనున్న నేపథ్యంలో ధోని బుధవారం మీడియాతో మాట్లాడాడు. ‘చివరి టెస్టు సిరీస్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఒకే ఒక్క సెషన్ బాగా ఆడలేదు. సిరీస్ మొత్తంతో పోలిస్తే రెండున్నర గంటలు మంచి క్రికెట్ ఆడలేకపోయాం.
దాని వల్లే సిరీస్ కోల్పోయాం. కీలక సమయంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. కాబట్టి ప్రస్తుతం దీనిపై పూర్తిగా దృష్టిపెట్టాం. ఈ ఫార్మాట్‌లో ఒకటి, రెండు గంటలు బాగా ఆడకపోయినా మ్యాచ్ మొత్తంపై దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆత్మ విశ్వాసంతో పూర్తి ఆధిపత్యం కనబర్చాలి. మంచి భాగస్వామ్యాలు జోడించాలి’ అని ధోని పేర్కొన్నాడు.
వన్డే సిరీస్‌ను మర్చిపోయాం
వన్డేల్లో ఎదురైన ఓటమిని మర్చిపోయేందుకు తమకు మంచి సమయమే లభించిందని చెప్పిన ధోని టెస్టు సిరీస్‌పై పూర్తిగా దృష్టిపెట్టామన్నాడు. పచ్చిక వికెట్లపై ఆడేందుకు తాము భయపడటం లేదన్నాడు. అయితే వికెట్ మీద ఎక్కువ పచ్చిక ఉండటం వల్ల తేమ కూడా అధికంగా ఉంటుందని అభిప్రాయపడిన కెప్టెన్ బ్యాటింగ్‌కు కాస్త ఇబ్బంది అని చెప్పాడు. వికెట్ పొడిగా, కఠినంగా ఉంటే మంచి స్ట్రోక్స్ ఆడొచ్చన్నాడు. జహీర్, ఇషాంత్‌ల గురించి మాట్లాడుతూ.... ‘జహీర్ వద్ద ఉన్న కొత్త ప్రణాళికలు మాకు ఉపయోగపడతాయి. యువ బౌలర్లను బాగా ప్రోత్సహిస్తాడు. ఉపఖండం బయట అతను మంచి బౌలర్. అనుభవం ఉన్న బౌలర్ జట్టులో ఉండటం చాలా మంచిది. ఇషాంత్ ఛేంజ్ బౌలర్‌గా కాకుండా కీలక సమయంలో వికెట్లు తీసేందుకు ఉపయోగిస్తున్నాం. 25, 30 ఓవర్ల తర్వాత బంతిని స్వింగ్ చేయలేం. కాబట్టి ఎక్స్‌ట్రా బౌన్స్‌తో బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాలి. ఇది చాలా కీలకమైంది. ఒకే తరహాలో, ఒకే ప్రాంతంలో లెంగ్త్‌కు కట్టుబడి బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచాలి’ అని కెప్టెన్ వివరించాడు. చతేశ్వర్ పుజారా నిలకడగా ఆడటం తమకు లాభిస్తుందన్నాడు. మిడిలార్డర్‌లో ఎక్కువసేపు క్రీజులో ఉండటాన్ని అతను ఆస్వాదిస్తాడన్నాడు. పుజారాను రెచ్చగొట్టడం అంత సులువుకాదని ధోని స్పష్టం చేశాడు.
నలుగురు సీమర్లతో కివీస్...
తొలి టెస్టులో తాము నలుగురు సీమర్లతో ఆడతామని కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ చెప్పాడు. విండీస్‌తో ఆడిన టెస్టు జట్టును యథావిధిగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దించుతున్నామన్నాడు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి నుంచి భారత్‌కు కష్టాలు తప్పవన్నాడు. ‘పచ్చిక వికెట్‌పై నలుగురు సీమర్లతో ఆడటం ఉత్సాహన్నిస్తుంది. వికెట్ నుంచి సహకారం లేకపోయినా సోధి మంచి ప్రదర్శన కనబర్చాడు. తన సత్తాకు న్యాయం చేకూరుస్తాడని నా నమ్మకం’ అని మెకల్లమ్ వెల్లడించాడు.
ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ‘భారతరత్న’ అవార్డును స్వీకరించిన బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు మహీ... శుభాకాంక్షలు తెలిపాడు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న మాస్టర్ ఈ అవార్డుకు అన్ని విధాలా అర్హుడన్నాడు. ‘ఇది అద్భుతమైన వార్త. క్రీడాకారుడికి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఓ సాధారణ పౌరుడికి ఇంతకంటే గొప్ప పురస్కారం ఉండదు. మైదానం లోపల, బయటా సచిన్ ఒత్తిడిని జయించిన తీరు అమోఘం. కెరీర్ మొత్తం దీన్ని ఒకేలా కొనసాగించాడు. కాబట్టే అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు’ అని ధోని వ్యాఖ్యానించాడు.