బ్యాటింగ్ లైనప్లో మార్పులు ఉండకపోవచ్చు
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ఉండకపోవచ్చని పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ అన్నాడు. భారత జట్టుకు నిలకడైన బ్యాటింగ్ లైనప్ ఉందని ధోనీ అభిప్రాయపడ్డాడు.
భారత టి-20, వన్డే జట్లకు ధోనీ, టెస్టు జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్లో జరిగే టెస్టు సిరీస్లో కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలో దిగుతోంది. భారత బ్యాటింగ్ లైనప్లో టాప్-6 ఆటగాళ్లు నిలకడగా ఆడుతున్నారని, ఉపఖండం ఆవల ఆడిన అనుభవం ఉందని ధోనీ చెప్పాడు. తుది జట్టులోకి ఒకర్నో ఇద్దర్నో కొత్తగా తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. జట్టుకు అవసరమైనంతమంది బౌలర్లు అందుబాటులో ఉన్నారని చెప్పాడు. వెస్టిండీస్లో వికెట్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నాడు. భారత్, విండీస్ల మధ్య గురువారం నుంచి తొలిటెస్టు జరగనుంది. 2011లో వెస్టిండీస్కు భారత్ వెళ్లినపుడు ధోనీ 1-0తో సిరీస్ను గెలిపించాడు.