‘లోధా’ సిఫారసులకు బీసీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు ఏడాది తర్వాత లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. గత ఏడాది జూలై 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు లోధా సిఫారసులకు ఆమోద ముద్ర వేస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్‌జీఎం) ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి వెల్లడించారు. అయితే ఇందులో కూడా బోర్డు పూర్తి స్థాయిలో అన్నింటికీ అంగీకరించలేదు.
ఐదు కీలక అంశాలపై మాత్రం స్తబ్దత అలాగే కొనసాగనుంది. ఒక రాష్ట్రం–ఒకే ఓటు, జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యుల కుదింపు, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య, ఆఫీస్ బేరర్ల పదవీ కాలం, బోర్డు సభ్యులకు వయోపరిమితి అంశాలపై మాత్రం బీసీసీఐ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.