
న్యూఢిల్లీ: క్రికెట్ బోర్డుకు ఇది గట్టి ఎదురుదెబ్బే! భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి ఏమాత్రం మింగుడుపడని విధంగా కోర్టు సహాయకుడు (అమికస్ క్యూరీ) వ్యవహరించారు. బోర్డు ప్రక్షాళన, పారదర్శకత కోసం జస్టిస్ ఆర్.ఎమ్.లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫార్సుల్ని అమలు చేయాల్సిందేనని అమికస్ క్యూరీ గోపాల్ సుబ్రమణియమ్ సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. ఒక్కటి మినహా మిగతా సిఫార్సుల్ని బీసీసీఐ నియమావళిలో చేర్చాల్సిందేనన్నారు. ఆ ఒక్కటి ఏంటంటే సెలక్షన్ కమిటీ నియామక ప్రక్రియ. ఐదుగురు సభ్యుల ప్యానెల్‌ను ముగ్గురితో కుదించకుండా కొనసాగవచ్చని, కేవలం టెస్టులాడిన వారినే సెలక్టర్లు చేయాల్సిన పనిలేకుండా 20 ‘ఫస్ట్‌క్లాస్’ మ్యాచ్‌లాడినా ఫర్వాలేదన్నారు.
మిగతా ఐదు ప్రధాన సిఫార్సులైన... ఒక రాష్ట్రం–ఒక ఓటు, గరిష్టంగా పదవుల్లో కొనసాగే కాలం 18 ఏళ్లు (9+9), పదవుల మధ్య మూడేళ్ల విరామం, 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, ఎన్నికైన సభ్యులు (ఆఫీస్ బేరర్లు), సీఈఓ (ప్రొఫెషనల్స్)ల మధ్య అధికార పంపకాలులాంటివి అమలు చేయాలని సుబ్రమణియమ్ నివేదిక సమర్పించారు. దీనిపై సుప్రీం కోర్టు జూలై 4న జరిగే విచారణలో తీర్పు ఇచ్చే అవకాశముంది.