టి20 సిరీస్‌ను వరుస పరాజయాలతో కోల్పోయిన టీమిండియా వన్డే సిరీస్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఓపెనింగ్ తడబడినా... టాపార్డర్ నిలబడలేకపోయినా... మిడిలార్డర్ పటిష్టత టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంతోషపెట్టే అంశం. ప్రపంచకప్‌నకు ముందు సాధ్యమైనన్ని సానుకూల ఫలితాలు సాధించాలని కోహ్లి సేన భావిస్తోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి 2–0తో ఆధిక్యం సాధించాలని టీమిండియా ఆశిస్తోంది.
నాగ్‌పూర్: ప్రపంచకప్ సన్నాహాల్లో ఉన్న టీమిండియా మరో విజయంపై కన్నేసింది. మంగళవారం జరిగే రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై గెలిచి సిరీస్‌లో ఆధిపత్యం పెంచుకోవాలని ఆశిస్తోంది. గత మ్యాచ్‌లో కనబర్చిన ఆల్‌రౌండ్ ప్రదర్శనను నాగ్‌పూర్‌లోనూ కొనసాగించేందుకు సిద్ధమైంది. మరోవైపు పొట్టి ఫార్మాట్‌లో భారత్‌ను గట్టిగానే దెబ్బకొట్టిన ఆసీస్ వన్డే సిరీస్‌లో వెనుకబడింది. నిజానికి తొలి మ్యాచ్‌లో ఒక దశలో భారత్‌ను ‘కంగారూ’ పెట్టింది. తక్కువ స్కోరైనా నిలబెట్టుకునే స్థితిలో కనిపించింది. అయితే ధోని–కేదార్ ద్వయం ఫలితాన్ని ఆసీస్‌కు దూరం చేసింది. ఇక రెండో వన్డేలోనైనా గెలుపు బాట పట్టాలని ఫించ్ బృందం కసితో సిద్ధమైంది.
మార్పుల్లేని జట్టుతో...
మెగా ఈవెంట్‌కు ముందు మిగిలున్నవి ఈ నాలుగు వన్డేలే! కాబట్టి ప్రతి మ్యాచ్ టీమిండియాకు కీలకం. ఇంతవరకు ఆటగాళ్లకు అడపాదడపా అవకాశమిస్తూనే వచ్చింది. ఇప్పుడైతే గెలుపు మలుపు తీసుకోవాల్సిందే. కాబట్టి రెండో వన్డేలో మార్పుల్లేని జట్టుతో కోహ్లి సేన బరిలోకి దిగనుంది. దీంతో హైదరాబాద్ వన్డేలో విఫలమైన శిఖర్ ధావన్ బెర్త్‌కు ఢోకా లేదు. కచ్చితంగా రాహుల్‌కు అవకాశమివ్వాల ని భావిస్తే తప్ప ధావన్, రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడం ఖాయం. పరుగుల ఆకలితో ఉండే రోహిత్, కోహ్లిలు తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించా రు. తనదైన రోజున రోహిత్ శర్మకు పట్టపగ్గాలుండవనేది చాలాసార్లు రుజువైంది. ఇక తెలుగు తేజం అంబటి రాయుడు విఫలమైనప్పటికీ అతని స్ట్రోక్స్‌పై నమ్మకమున్న టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని ఆడించేందుకే నిర్ణయం తీసుకుంది. కేదార్‌తో కీలక ఇన్నింగ్స్ ఆడించిన 37 ఏళ్ల వెటరన్ ధోని ఫిట్‌నెస్‌పై ఎలాంటి భ్రమలు అక్కర్లేదని కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు.
బుమ్రా పరుగుల్ని నియంత్రించాలి
బౌలింగ్‌లో విజయ్ శంకర్ ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. అయితే కోహ్లి ఈ పేస్ ఆల్‌రౌండర్‌కు మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. దీంతో రిషభ్ పంత్ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. ఓవరాల్‌గా బౌలింగ్ విషయానికొస్తే గత మ్యాచ్‌లో ‘యార్కర్ల కింగ్’ బుమ్రా 2 వికెట్లైతే తీశాడు కానీ... తక్కువ స్కోరులో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. షమీ అచ్చంగా పరిమిత ఓవర్లకు సరిపడే బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. నిర్ణీత కోటాలో 2 మెయిడెన్లు వేసిన ఈ సీమర్ 44 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. స్పిన్నర్లలో కుల్దీప్ యాదవ్ తనపై టీమ్ మేనేజ్‌మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయలేదు. కీలకమైన తరుణంలో వికెట్లు తీసి ఆసీస్‌ను కంగారు పెట్టించాడు. రవీంద్ర జడేజా వికెట్ తీయలేకపోయినా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 33 పరుగులే ఇచ్చాడు. కేదార్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ కంటే ముందు బంతితోనూ అదరగొట్టాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ స్టొయినిస్‌ను పెవిలియన్ చేర్చాడు.
కోహ్లి... జంపాతో జాగ్రత్త!
ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ అడమ్ జంపాని కోహ్లి జాగ్రత్తగా ఎదుర్కోవాలి. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ స్పిన్నర్ నాలుగు సార్లు కోహ్లిని ఔట్ చేశాడు. ఇంకెవర్నీ రెండు సార్లకు మించి ఔట్ చేయని జంపా కోహ్లిని మాత్రం టార్గెట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని బౌలింగ్‌పై కోహ్లి కన్నేయాలి. ప్రపంచకప్‌నకు ముందు భారత సారథి ఈ బౌలర్‌పై పైచేయి సాధించాల్సిందే.
టాపార్డరే అసలు సమస్య
ఆసీస్ విషయానికొస్తే గత మ్యాచ్‌లో ఓపెనింగ్‌లో ఉస్మాన్ ఖాజా (50) చేసిన అర్ధసెంచరే టాప్ స్కోరు. టాపార్డర్‌లో ఖాజా మినహా ఇంకెవరూ జట్టుకు ఉపయోగపడే ఇన్నింగ్సే ఆడలేదు. కెప్టెన్ ఫించ్ మూడు బంతులకే డకౌటయ్యాడు. స్టొయినిస్ నిలబడే దశలో వెనుదిరిగాడు. మిడిలార్డర్‌లో మ్యాక్స్‌వెల్ మెరుగనిపించాడు. టి20ల్లో భారత్‌పై విరుచుకుపడ్డ ఇతన్ని షమీ తెలివిగా క్లీన్‌బౌల్డ్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో క్యారీ ఫర్వాలేదనిపించాడు. లేదంటే 200 పైచిలుకు పరుగులు గగనమయ్యేవి. మొత్తమ్మీద ఆసీస్‌ను టాపార్డరే కలవరపెడుతోంది. సిరీస్‌లో నిలబడాలంటే తప్పకుండా రెండో వన్డే నుంచే పైచేయి సాధించడం ఆరంభించాలి. లేదంటే వరుస పరాజయాలతో మరింత ఒత్తిడిలోకి కూరుకుపోవడం ఖాయం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
ఈ వేదికపై ఆసీస్‌కుకష్టాలు
విదర్భ క్రికెట్ స్టేడియం ఆసీస్‌కు కలిసి రాలేదు. ముఖ్యంగా భారత్ ఎదు రైన ప్రతీసారి భారీ తేడాతోనే ఓటమి పాలైంది. తలపడ్డ మూడుసార్లు భారత్‌నే విజయం వరించింది. ఎనిమిదేళ్ల క్రితం 2011 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై మాత్రం గెలిచింది. ఈ రెండో మ్యాచ్ కోసం కంగారూ జట్టు ఒక మార్పు చేసింది. టర్నర్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ షాన్ మార్‡్షను తుది జట్టులోకి తీసుకుంది.
పిచ్, వాతావరణం
ఫ్లాట్ పిచ్. మ్యాచ్ సాగేకొద్దీ నెమ్మదించే అవకాశాలున్నాయి. బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమాన అవకాశం కల్పించవచ్చు. ఆదివారం రాత్రి వర్షం కురిసినప్పటికీ సోమవారం కొనసాగలేదు. పిచ్, మైదానం సాధారణస్థితిలోనే ఉంది. మంగళవారం వర్షం ముప్పులేదు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాయుడు, ధోని, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, జడేజా, షమీ, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్‌ష, స్టొయినిస్, హ్యాండ్స్‌కోంబ్, మ్యాక్స్‌వెల్, క్యారీ, కూల్టర్ నీల్, కమిన్స్, బెహ్రెన్‌డార్ఫ్, జంపా.
Comments
Please login to add a commentAdd a comment