ఇండోర్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముంగిట మరో అరుదైన అవకాశం నిలిచింది. అది కూడా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గతంలో సాధించిన ఘనత. ఆస్ట్రేలియాతో మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే సిరీస్ ను కైవసం చేసుకోవడమే కాకుండా మరో మైలురాయిని కూడా కోహ్లి చేరతాడు. గతంలో ధోని నాయకత్వంలో భారత జట్టు వరుసగా తొమ్మిది వన్డే మ్యాచ్లను గెలిచింది. దాన్ని సమం చేసే అవకాశం ఇప్పుడు విరాట్ ముందు ఉంది. ధోని సారథ్యంలో 2008 నవంబర్ నుంచి 2009 ఫిబ్రవరి మధ్య కాలంలో భారత జట్టు వరుసగా తొమ్మిది వన్డేల్లో విజయం సాధించింది. ఆ తరువాత ఇంతకాలానికి కోహ్లి నేతృత్వంలోని టీమిండియా మరోసారి ఆ అవకాశానికి అడుగు దూరంలో నిలిచింది. ఆసీస్ తో మూడో వన్డేలో విజయం సాధిస్తే ధోని సరసన కోహ్లి చేరతాడు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు విండీస్ తో జరిగిన ఐదో వన్డేలో భారత్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆసీస్ తో సిరీస్ లో రెండు వరుస మ్యాచ్ లను భారత్ గెలిచింది. దాంతో ప్రస్తుత భారత వరుస వన్డే విజయాల సంఖ్య ఎనిమిదిగా ఉంది. తద్వారా ఈరోజు మ్యాచ్ లో టీమిండియా విజయం సాధిస్తే ధోని రికార్డును కోహ్లి సమం చేసే అవకాశం దక్కుతుంది.
ఇదిలా ఉంచితే, కోహ్లి మరో 41 పరుగులు చేస్తే అత్యంత వేగంగా (35ఇన్నింగ్స్) రెండు వేల పరుగులు పూర్తి చేసిన తొలి కెప్టెన్‌గా డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)ను కోహ్లి అధిగమిస్తాడు.