కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత భారత విజయాల్లో ధోని పాత్ర ఇంకా కొనసాగడాన్ని వార్నర్ కొనియాడాడు. కోల్ కతా వన్డే తరువాత ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్య్వూలో ధోని 'కెప్టెన్సీ'ని వార్నర్ ప్రస్తావించాడు.
'కోహ్లి-ధోని కలిసి భారత జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లికి కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ధోని జట్టును నడిపించడం నిజంగా ప్రశంసనీయం. ధోని కెప్టెన్సీ చేసే సమయంలో చాలా కూల్ గా అతని పని చేసుకుపో్యేవాడు. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ధోని బయటకు వచ్చినప్పటికీ అతడు విజయాల కోసం తాపత్రాయపడుతున్నాడు. ఇక్కడ కోహ్లిని ధోనినే నడిపిస్తున్నాడని చెప్పాలి. ఈ కలయికే భారత క్రికెట్ జట్టుకు అద్భుతమైన విజయాల్ని అందిస్తోంది. ఇది ఆ క్రికెట్ జట్టుకు మంచి పరిణామం'అని వార్నర్ చెప్పాడు. కాగా, భారత జట్టు వరుస విజయాలపై స్పందిస్తూ.. ఇప్పటివరకూ కోహ్లిని కుంగదీసి పరాజయాలు అతనికి ఎదురుకాలేదన్నాడు.ఒకవేళ భారత జట్టు వరుస పరాజయాలు చవిచూసినప్పుడు కోహ్లికి అసలైన సవాల్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నాడు.