కోహ్లి వల్లే ధోనిలో పరివర్తన: గంగూలీ
న్యూఢిల్లీ:ఇటీవల కాలంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆటలో వచ్చిన తాజా పరివర్తనకు కెప్టెన్ విరాట్ కోహ్లినే కారణమంటున్నారు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. సాధారణంగా సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న ధోనికి పరుగులు ఎలా సాధించాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకపోయినా అతనిపై కోహ్లికి విపరీతమైన నమ్మకం ఉందన్నారు. దీని కారణంగానే ధోనిలో నూతన ఆటగాడ్ని చూస్తున్నామని గంగూలీ అభిప్రాయపడ్డారు.
'ధోని కెరీర్లో 300 వన్డేలకు పైగా ఆడాడు. ఆ క్రమంలోనే తొమ్మిది వేలకు పైగా పరుగుల్ని కూడా సాధించాడు. ఇలా సుదీర్ఘ కాలంగా క్రికెట్ ఆడుతున్న ధోనికి పరుగులు ఎలా సాధించాలో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అతని నుంచి ఇంకా మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ లు వస్తునే ఉన్నాయి. అందుకు కారణం కచ్చితంగా కెప్టెన్ కోహ్లినే.. ఇక్కడ క్రెడిట్ మాత్రం కోహ్లికే ఇవ్వాలి. ఎందుకంటే ధోనిపై కోహ్లికి విపరీతమైన నమ్మకం. అదే సమయంలో ధోనికి స్వేచ్ఛగా ఆడే వాతావరణాన్ని కోహ్లి కల్పిస్తున్నాడు.
ధోనిలో ఆటలో మరింత పరివర్తన రావడానికి కోహ్లిది కీలక బాధ్యతగా చెప్పొచ్చు' అని గంగూలీ అభిప్రాయపడ్డారు. శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంలో ధోని ముఖ్య భూమికపోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆసీస్ తో తొలి వన్డేలో ధోని 79 పరుగులతో రాణించి భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.