
మహేళ... వీడ్కోలు వేళ
నేటి నుంచి జయవర్ధనే ఆఖరి టెస్టు
ఆటను ఆరాధించే వారుంటారు.. ఆస్వాదించే వారుంటారు. క్రికెట్‌నే శ్వాసిస్తూ.. క్రికెట్ కోసమే జీవించేవారు కొందరే ఉంటారు. అలా రెండో కోవకు చెందినవాడే శ్రీలంక క్రికెటర్ మహేళ జయవర్ధనే. ప్రపంచ క్రికెట్‌ను దిగ్గజాలు ఏలుతున్న తరంలోనే అరంగేట్రం చేసినా.. ఆట పట్ల అంకితభావం, ఆటగాడిగా పరిపూర్ణత్వంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా, అద్భుతమైన ఫీల్డర్‌గా, 17 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్‌కు వెన్నెముకగా నిలుస్తూ వచ్చిన జయవర్ధనే.. టెస్టు క్రికెట్‌కు ఇక దూరమవుతున్నాడు. పాకిస్థాన్‌తో నేటి నుంచి జరగనున్న రెండో టెస్టే అతనికి చివరి టెస్టు.
సాక్షి క్రీడావిభాగం: బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతున్నప్పుడు ఆదుకోవాలన్నా.. పరుగుల వేగం మందగించినప్పుడు చెలరేగి ఆడాలన్నా.. మైదానంలో పాదరసంలా కదులుతూ క్యాచ్‌లు అందుకోవాలన్నా.. గందరగోళంలో ఉన్న కెప్టెన్‌కు సలహా కావాల్సివచ్చినా.. శ్రీలంక జట్టు ఆ ఒక్కడి వైపే చూసేది. జట్టు సంక్షోభంలో ఉన్న ప్రతిసారీ సారథ్య బాధ్యతల బరువు అతని నెత్తినే మోపేది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులెదురైనా.. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగిన జయవర్ధనే ఇక అన్ని బాధ్యతల నుంచీ తప్పుకుంటున్నాడు. టి20 ఫార్మాట్ నుంచి ఇంతకుముందే రిటైరైన మహేళ.. టెస్టులకూ గుడ్‌బై చెప్పి, వన్డేల్లో మాత్రమే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.
దిగ్గజాల సరసన..
అర్జున రణతుంగ, అరవింద డిసిల్వ, సనత్ జయసూర్య వంటి మహామహులు ఉన్న సమయంలోనే (1997లో భారత్‌పై మ్యాచ్‌తో) శ్రీలంక క్రికెట్‌లో అడుగు పెట్టిన మహేళ.. అతితక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడయ్యాడు. ఆడిన రెండో సిరీస్‌లోనే భారీ సెంచరీ సాధించి (167-న్యూజిలాండ్‌పై) అందరినీ ఆశ్చర్య పరిచాడు. అనుభవజ్ఞులకు మాత్రమే సాధ్యమయ్యే డబుల్ సెంచరీని (242-భారత్‌పై కొలంబోలో) రెండో ఏడాదే సాధించి శ్రీలంక క్రికెట్‌కు భవిష్యత్తు తానేనని చాటుకున్నాడు. కెప్టెన్లు ఎవరైనా.. మైదానంలో ఫీల్డింగ్‌కు మాత్రమే పరిమితం కాకుండా వారి నిర్ణయాల్లో పాలుపంచుకుంటూ బాధ్యతను పంచుకున్నాడు.
2006లో ఇంగ్లండ్‌లో తాత్కాలిక సారథిగా వ్యవహరించి విదేశాల్లో తొలి సిరీస్‌లోనే ఆకట్టుకున్నాడు. ఆ సిరీస్‌ను శ్రీలంక 1-1తో డ్రాగా ముగించింది. దీంతో పూర్తిస్థాయి కెప్టెన్ అయిన జయవర్ధనే.. మూడేళ్లపాటు జట్టును విజయపథంలో నడిపించాడు. బోర్డు రాజకీయాల కారణంగా కెప్టెన్సీని వదులుకున్నా.. సంక్షోభ సమయంలో మళ్లీ తానే దిక్కై 2012లో తిరిగి బాధ్యతలు చేపట్టాడు. అయినా దాన్నే పట్టుకొని వేలాడకుండా భవిష్యత్ కెప్టెన్‌ను తాముండగానే తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మాథ్యూస్‌కు పగ్గాలప్పగించి గౌరవంగా తప్పుకున్నాడు. టి20 ప్రపంచకప్‌ను శ్రీలంక గెలుచుకోవడంలో కీలకపాత్ర పోషించినా.. మరో యువ ఆటగాడికి చోటు కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు.
ఘనమైన రికార్డులు
సహచరుడు సంగక్కరతో కలిసి రికార్డులతో పాటు శ్రీలంకకు ఎన్నో విజయాలు అందించాడు. ఫార్మాట్ ఏదైనా.. తనదైన శైలిలో చెలరేగి అడాడు. ఈ క్రమంలో పలు రికార్డుల్ని తన సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాపై 374 పరుగులు చేసి శ్రీలంక తరపున అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించాడు. అదే మ్యాచ్‌లో సంగక్కరతో కలిసి 624 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన తొలి లంక బ్యాట్స్‌మన్‌గా నిలవడంతోపాటు ఇటు వన్డేల్లోనూ ఆ మైలురాయిని దాటాడు.
ఓ ట్రిపుల్ సెంచరీతోపాటు రికార్డు స్థాయిలో ఆరు డబుల్ సెంచరీలు సాధించాడు. రెండుసార్లు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డునూ అందుకున్నాడు. జయవర్ధనే సామాజిక సేవలోనూ ముందున్నాడు. 16వ ఏటనే తన సోదరుణ్ని బ్రెయిన్ ట్యూమర్ కారణంగా పోగొట్టుకున్న మహేళ.. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంలో భాగస్వామి అవుతున్నాడు. శ్రీలంకలోని మహారాగమ ప్రాంతంలో గల ఆస్పత్రిలో 750 పడకల క్యాన్సర్ యూనిట్‌ను ప్రారంభించనున్నాడు.